ఉత్సాహంగా..‘యువగళం’
1 min readమండుటెండల్లో యువనేత ఎదుట సమస్యల వెల్లువ
అడుగడుగునా హారతులతో మహిళల నీరాజనాలు
పల్లెవెలుగు: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 74వ రోజు (మంగళవారం) ఆలూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. అడుగడగునా మహిళలు యువనేతకు హారతులు పట్టి నీరాజనాలు పలికారు. మండుటెండల్లో సైతం వివిధ వర్గాల ప్రజలు యువనేతను కలిసి సమస్యలు విన్నవించారు. పల్లెదొడ్డిలో లోకేష్ ని కలిసిన మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేశారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. తాగునీటి సమస్య తో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు.
సమస్యలన్నీ పరిష్కరిస్తాం… లోకేష్ హామీ…:
టిడిపి హయాంలో గ్రామాల్లో 25 వేల కిలోమీటర్ల సిసి రోడ్లు వేసాం. ఇప్పుడు జగన్ పంచాయతీ నిధులు కాజేసి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలేదన్నారు యువనేత నారా లోకేష్ . టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ గ్రామంలో ఉన్న తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం. డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. దేవనకొండలో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు యువనేతకు ఘన స్వాగతం పలికారు. లోకేష్ ని చూసేందుకు మహిళలు, యువత, వృద్దులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. నిత్యావసర సరుకుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, పన్నులు విపరీతంగా పెంచారు. చెత్త పన్ను కూడా ముక్కు పిండి వసూలు చేస్తున్నారని మహిళలు వాపోయారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు.దేవనకొండలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించి తమ సమస్యలను యువనేత దృష్టికి తెచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చాక విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పి ముందుకు సాగారు.వలగొండ క్రాస్ వద్ద జరిగిన బహిరంగసభకు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా జనం హాజరయ్యారు.