ఒకే మూత్రపిండంలో 154 రాళ్ల వెలికితీత
1 min read– సికింద్రాబాద్ విక్రమ్‌పురి ఏఐఎన్‌యూ వైద్యుల ఘనత
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం సర్వసాధారణంగా కనిపించే సమస్య. కానీ, రామగుండం ప్రాంతానికి చెందిన ఓ 45 ఏళ్ల వ్యక్తికి ఒకే మూత్రపిండంలో ఏకంగా 154 రాళ్లు ఏర్పడ్డాయి. వాటిలో ఒకటి ఏకంగా 62 మిల్లీమీటర్ల పొడవు ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను, అతడికి అందించిన చికిత్స విధానాన్ని నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీకి చెందిన కన్సల్టెంట్ యూరాలజిస్టు డాక్టర్ రాఘవేంద్ర తెలిపారు. ‘‘రామగుండానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి మూత్రపిండంలో పెద్ద రాయి ఉందని స్థానికంగా నిర్ధారించి, అతడికి మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్ర కోశానికి సంబంధించిన సీటీ స్కాన్ తీసి, కేసు తీవ్రత దృష్ట్యా ఇక్కడకు పంపారు. అందులో 62 మిల్లీమీటర్ల పొడవున్న రాయి మూత్రపిండంలోని అన్ని భాగాలకూ వ్యాపించింది. అతడికి వైద్యపరీక్షలు చేయగా, మధుమేహం ఏమాత్రం నియంత్రణలో లేకుండా బాగా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దాన్ని అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత అతడికి ఎండోస్కొపిక్ విధానంలో పెర్ క్యుటేనియస్ నెఫ్రో లితోటమీ (పీసీఎన్ఎల్) అనే శస్త్రచికిత్స చేశాం. ఆ పెద్ద రాయిని ముక్కలుగా పగలగొట్టి బయటకు తీయగా, మిగిలిన రాళ్లన్నింటినీ యథాతథంగా బయటకు తీశాం. మొత్తం 154 రాళ్లు ఒకే మూత్రపిండంలో ఉన్నాయి. శాఖలుగా విస్తరించే రాళ్లు మూత్రపిండాల విషయంలో చాలా సంక్లిష్టమైనవి. ఇవి మూత్ర సేకరణ వ్యవస్థలో చాలా ప్రాంతాన్ని ఆక్రమిస్తాయి. దీనివల్ల చాలా రకాల వ్యాధులు వస్తాయి, పదే పదే మూత్రకోశ ఇన్ఫెక్షన్లు కూడా సంభవిస్తాయి. వాటితో పాటు రక్తంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్, మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం లాంటివి ఉంటాయి. సరైన సమయానికి చికిత్స చేయించకపోతే రోగి మరణించే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి రాళ్లున్న వారికి చికిత్స చేయడం సవాలుతో కూడుకున్నది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం, కొత్త టెక్నిక్‌లు రావడంతో వీలైనంత తక్కువ సమస్యలతో సమర్థ చికిత్స అందించడం వీలవుతోంది. సికింద్రాబాద్ విక్రమ్‌పురి ప్రాంతంలో ఉన్న ఏఐఎన్‌యూ ఆస్పత్రిలో ఈ రాళ్లను పూర్తిగా తీసేయడానికి వీలుగా మల్టీ ట్రాక్ట్ పీసీఎన్ఎల్ చేశాం. అతిపెద్ద రాయి 62 మి.మీ. x 39 మి.మీ. ఉండటంతో దాన్ని లేజర్ సాయంతో చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి బయటకు తీశాం. ఆ తర్వాత మిగిలిన 153 రాళ్లను యథాతథంగా తీశాం. వాటిలో 2 మి.మీ. నుంచి 15 మి.మీ. వరకు వేర్వేరు పరిమాణాల్లో ఉన్నాయి. రక్తం చాలా తక్కువమొత్తంలోనే పోయింది, రోగి కూడా పూర్తిగా కోలుకున్నాడు. మూత్రపిండాల్లో సంక్లిష్టమైన, పెద్ద స్థాయి రాళ్లు ఉన్నప్పుడు వాటిని తొలగించడానికి అత్యుత్తమ చికిత్సగా పీసీఎన్ఎల్ ఉంటోంది. ఈ శస్త్రచికిత్స సామర్థ్యం, దాని సురక్షిత స్థాయి పలు పరిశోధనల్లో రుజువైంది. అయితే మూత్రపిండాల్లో రాళ్లతో పాటు మధుమేహం కూడా ఉన్నవారికి ఇన్ఫెక్షన్లు రావడంతో పాటు, పీసీఎన్ఎల్ చేసిన తర్వాత పలు రకాల సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే ఈ కేసులో మాత్రం అలాంటివి ఏమీ లేకపోవడం విశేషం’’ అని డాక్టర్ రాఘవేంద్ర వివరించారు.