ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత.. వాహనాలకు నిప్పు
1 min readపల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లా ఆత్మకూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒక ప్రార్థన మందిరం నిర్మాణం పై తెలెత్తిన వివాదం ఈ ఘటనకు కారణమైంది. ఒక వర్గానికి చెందిన ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ పై రాళ్లు రువ్వి.. పలు వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఆత్మకూరు పట్టణంలోని తోటగేరి వద్ద ప్రైవేటు స్థలంలో ఓ వర్గం వారు ప్రార్థనా మందిర నిర్మాణం చేపట్టారు. దీనిపై కొందరు మునిసిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఆ నిర్మాణాన్ని నిలిపి వేశారు. శనివారం ఆ వర్గం వారు వచ్చి ప్రార్థనా మందిరాన్ని నిర్మాణ పనులు తిరిగి చేపడుతుండగా కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ సమాచారం అందుకున్న నంద్యాల బీజేపీ అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి అక్కడి వెళ్లారు. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఓ వర్గం వారు శ్రీకాంత్‌రెడ్డిపై దాడికి యత్నించగా… ఆయన తప్పించుకుని రక్షణ కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఒక బైక్‌ను ఢీకొంది. దీంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆందోళనకారులు పెద్దసంఖ్యలో గుమిగూడి పోలీసు స్టేషన్‌ను చుట్టుముట్టారు. అక్కడ ఉన్న శ్రీకాంత్‌రెడ్డి వాహనాన్ని ఎత్తి పల్టీలు కొట్టించి ధ్వంసం చేశారు. శ్రీకాంత్ రెడ్డి వాహనానికి నిప్పు పెట్టారు. పోలీస్ స్టేషన్ పైన రాళ్లు రువ్వారు. ఇద్దరు ఎస్ఐలు , ఒక కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.