‘నకిలీ’కి.. నందికొట్కూరు అడ్డా..!
1 min read– నకిలీ మినుముతో.. మళ్ళీ ముంచిన ‘పల్లవి’..!
– మోసపోయిన రైతులు.. లక్షల్లో నష్టం..
పల్లెవెలుగువెబ్, నందికొట్కూరు: కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ కేంద్రంలో నకిలీ విత్తనాలు, ఎరువులు, నూనెల విక్రయాలు జోరందుకున్నాయి. నకిలీ మొక్కజొన్న, మినుము విత్తనాలతో రైతులను నట్టేట ముంచుతున్నారు దుకాణాల యజమానులు. అధికారులు తనిఖీకి వస్తున్నారన్న సమాచారం ముందు తెలుసుకుంటూ…. ఆ సమయంలో దుకాణాలను బంద్ చేస్తున్నారు. మామూళ్లకు కక్కుర్తి పడిన కొందరు వ్యవసాయ శాఖ అధికారులు నకిలీ విత్తనాలు, మందులు, ఎరువులు వాడే దుకాణాదారులకు వత్తాసు పలుకుతున్నారు.
మినుముతో.. మళ్లీ ముంచిన ‘పల్లవి’:
పట్టణంలోని పల్లవి సీడ్స్ దుకాణం యజమానుల వలన రైతులు మరోసారి మోసపోయారు. దుకాణంలో మినుము విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు లక్షల్లో నష్టము వాటిల్లింది. పట్టణానికి చెందిన రైతు మహబూబ్ బాష పల్లవి సీడ్స్ దుకాణంలో మినుము పాకెట్లు కొనుగోలు చేశాడు. 12 ఎకరాల్లో మినుము పంట సాగుచేశాడు.70 రోజులు గడచిన పూత, పిందె రాలేదు. ఈ విషయమై స్థానిక సీపీఎం నాయకులను కలిసి రైతు తన గోడు వెలిబుచ్చారు. న్యాయం చేయాలని కోరారు.
మద్దిగట్లలో… 50 ఎకరాలు:
నందికొట్కూరు మండలంలోని మద్దిగట్ల గ్రామ పొలిమేరలో దాదాపు 50 ఎకరాల్లో నకిలీ మినుము విత్తనాలు వేసి మోసపోయిన రైతుల మినుము పంటను సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం. నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పి. పకీర్ సాహెబ్, రైతు సంఘం జిల్లా నాయకులు బెస్త రాజు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం. నాగేశ్వరరావు ,కార్మిక సంఘం జిల్లా నాయకులు పి. పకీరు సాహెబ్, రైతు సంఘం జిల్లా నాయకులు బెస్త రాజు మాట్లాడుతూ మద్దిగట్ల గ్రామ పొలిమేరలో రైతులు ఎస్. మహబూబ్ భాష, బి. వెంకటేశ్వర్లు పల్లవి సీడ్స్ యజమాని నాగేశ్వర్ రెడ్డి వద్ద నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ వారి టి9 రకానికి చెందిన మినుములను గత 70 రోజుల క్రితం కొనుగోలు చేసి పొలంలో విత్తనాలు వేశారు. పంటకాలం 90 రోజులకు పంట చేతికి వస్తుంది. కానీ 70 రోజులు అయినప్పటికీ పూత, పిందె, కాయలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు స్పందించి పల్లవి సీడ్స్ యజమాని పై చర్యలు తీసుకొని షాపు సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు టి. ఓబులేష్ ,సుధాకర్, రైతులు మురళి రెడ్డి ,ఎస్. అలీ తదితరులు పాల్గొన్నారు.