టీజీ భరత్‌పై 30 ఏళ్ల తర్వాత తప్పుడు ప్రచారాలు..
1 min readదళిత జేఏసీ నాయకులు… ఎన్నికల సమయంలోనే అసత్య ఆరోపణలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్‌పై అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని టీడీపీ కర్నూలు దళిత జేఏసీ నాయకులు మండిపడ్డారు. ధర్నా చౌక్ వద్ద దళిత జేఏసీ ఆధ్వర్యంలో నేతలందరూ శుక్రవారం నిరసన చేపట్టారు. కర్నూలు మండలం మామిదాలపాడు గ్రామంలోని 231/1 సి సర్వే నంబర్‌లో 33 సెంట్ల స్థలం తమ నాయకుడు టీజీ భరత్‌కు చెందినదని తెలిపారు. అయితే ఈ స్థలాన్ని టీజీ భరత్ అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారని కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టీజీ భరత్‌కు ఇతరుల ఆస్తులు అక్రమంగా తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. టీజీ భరత్ ఈ స్థలాన్ని 30 సంవత్సరాల క్రితం కొన్నారని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ పూర్తయి కూడా 30 ఏళ్లయిందన్నారు. కర్నూలులో టీజీ కుటుంబం నిజాయితీ ఏంటో అందరికీ తెలుసని.. వాళ్లు అక్రమాలు, అన్యాయాలు చేయరని అన్నారు. 30 ఏళ్ల క్రితం రిజిస్ట్రర్ అయిన ఈ స్థలంపై.. ఇప్పుడు వచ్చి అబద్దాలు ప్రచారం చేయడం తగదన్నారు. ఆ స్థలం మీదే అయితే కోర్టుకు వెళ్లాలని.. కోర్టు ఖర్చులు కూడా టీజీ భరత్ చెల్లిస్తారని అన్నారు. అప్పుడు కోర్టులోనే నిజనిజాలు తేలుతాయన్నారు.
ఎన్నికల సమయంలో టీజీ కుటుంబంపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. టీజీ భరత్ నిత్యం ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. టీజీ భరత్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని నాయకులే తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. కర్నూలు నియోజకవర్గం నుంచి టీజీ భరత్ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. కేవలం ఎన్నికలు వస్తున్నాయన్న నేపథ్యంలోనే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన ఆధారాలుంటే కోర్టులో తేల్చుకోవాలని హితవు పలికారు. స్వార్థ ప్రయోజనాల కోసం టీజీ భరత్‌పై బురదజల్లితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. దళితుల శ్రేయోభిలాషి టీజీ భరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, జనసేన ఇంచార్జి ఆర్షద్, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసెట్టి శ్రీనివాసులు, దళిత నాయకులు దేవా, గున్నామార్క్, పోతురాజు రవి కుమార్, పాల్ రాజ్, రాజ్ కుమార్, జూటూరు రవి, సురేంద్ర, పవన్ సాయి, చినమ్మి, ఈశ్వర్, అనిత, పెంచలయ్య, యేసు, శివ, కన్న, శ్యామ్, శారద, భాస్కర్, శ్రీను, భాస్కర్, శాంతమ్మ, చిట్టెమ్మ, తదితరులు పాల్గొన్నారు. దళిత నాయకులు పాల్గొన్నారు.
సమయం, టిడిపి, కోర్టు,