PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అప్పులు తెచ్చి ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట దిగుబడి రాకపోవడంతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పులబాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు , మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బ్రాహ్మణకొట్కూరు గ్రామానికి చెందిన రైతు కుర్వ చంద్రుడు (55) తనకున్న నాలుగు ఎకరాల పొలంతో పాటు 15 ఎకరాలు కౌలుకు తీసుకొని మిరప, ఉల్లి సాగు చేశారు. పంటల సాగు నిమిత్తం దాదాపు రూ.10 లక్షల వరకు అప్పులు చేశారు. ఆశించిన స్థాయిలో పంటల దిగుబడి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి అధికం కావడం అప్పులు తీరకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఓ వైపు అప్పులిచ్చిన వారి వేధింపులు.. మరోవైపు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో మనస్థాపానికి గురై గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.గురువారం రాత్రి ఇంటినుంచి బయటకు వెళ్లిన మృతుడు గ్రామ సమీపంలో కుంట వద్ద చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళుతున్న విద్యార్థులు గమనించి పెద్దలకు సమాచారం అందించారు. మృతుని గుర్తించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.బ్రాహ్మణ కొట్కూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపి మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .మృతుని భార్య లక్ష్మీ దేవి ఫిర్యాదు మేరకు బ్రాహ్మణ కొట్కూరు ఎస్సై ఓబులేసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి వివాహితులైన ఒక కుమార్తె , కుమారుడు ఉన్నారు.మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని , ఆర్థిక సహాయం అందించాలని వైసీపీ నాయకులు ఉదయ్ కిరణ్ రెడ్డి, ఓంకార రెడ్డి , పుల్లయ్య , తదితరులు డిమాండ్ చేశారు.

About Author