రైతును ముంచిన.. నకిలీ మొక్కజొన్న విత్తనం..!
1 min read– రూ.15 లక్షల పెట్టుబడి.. 25 ఎకరాల్లో పంట సాగు
– దుకాణదారులు.. కంపెనీ వారిని అడగాలంటూ.. దురుసు సమాధానం..
– న్యాయం చేయాలని వేడుకుంటున్న రైతు..
పల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు: కర్నూలు జిల్లాలో నకిలీ విత్తనాలు బెడద తీవ్రంగా ఉంది. జిల్లాలోని గూడురు, కోడుమూరు తదితర మండలాల రైతులు వేలాది మంది ఇటీవల కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. కావేరి కంపెనీ యాజమాన్యం నకిలీ పత్తి విత్తనాలు విక్రయించడంతో తాము నష్టపోయామని, పత్తి పూత కూడా రావలేదని కమ్యునిస్టుల సోదరులతో కలిసి ధర్నా, ఆందోళన చేపట్టారు. ఆ విషయంలో పూర్తి విచారణ చేసి.. రైతులకు న్యాయం చేస్తామన్న వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు. నందికొట్కూరు నియోజకవర్గంలో నకిలీ మొక్కజొన్న విత్తనాల వల్ల తాము పూర్తిగా నష్టపోయామని, ఆత్మహత్యేశరణ్యమంటున్నాడు జూపాడు బంగ్లా మండలం తుడిచర్ల గ్రామానికి చెందిన రైతు రాముడు.
15లక్షలు..25 ఎకరాలు..
నందికొట్కూరు నియోజకవర్గం జూపాడుబంగ్లా మండలంలోని తుడిచెర్ల గ్రామానికి చెందిన రైతు రాముడు లక్ష్మి 4959 రకం మొక్కజొన్న పంటను 25 ఎకరాల్లో సాగు చేశారు. పట్టణంలోని శ్రీ రామ సీడ్స్ దుకాణంలో రూ.30 వేలు చెల్లించి యాగంటి, నూజివీడు కంపెనికి చెందిన మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేశాడు. పెట్టుబడి కింద రూ.15 లక్షల వరకు ఖర్చు చేసినట్లు రైతు వాపోయాడు. పంట చేతికి వచ్చే సమయానికి కంకి పెరుగుదల లేకపోవడంతో నకిలీ విత్తనాల వలన మోసపోయిన విషయం తెలుసుకున్న రైతు విత్తనాల దుకాణం యజమానులను కలిసి న్యాయం చేయాలని కోరారు. అయితే తమకు సంబంధం లేదని కంపిని వారికి పిర్యాదు చేయాలని దురుసుగా సమాధానం ఇచ్చారని రైతు వాపోయాడు. సమస్యను సీపీఐ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం సీపీఐ నాయకులు రమేష్ బాబు రైతు సాగు చేసిన మొక్కజొన్న పంటను పరిశీలించారు.
యాగంటి, నూజివీడు కంపెనీలపై చర్యలు తీసుకోవాలి : సీపీఐ
నకిలీ విత్తనాల వలన నష్టపోయిన రైతు రాముడు ను ఆదుకోవాలని, నకిలీ మొక్కజొన్న విత్తనాలు విక్రయించిన నందికొట్కూరులోని శ్రీరామసీడ్స్ దుకాణాదారుడిపై, యాగంటి, నూజివీడు కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సీపీఐ మండల నాయకులు రమేష్‌బాబు, రైతు సంఘం నాయకులు అహమద్, దినేష్. లేని పక్షంలో రైతులను సమీకరించి భారీ ఎత్తున నందికొట్కూరు పట్టణంలో ఆందోళన చేపత్తుతామని హెచ్చరించారు. నకిలీ విత్తనాలతో పొసపోయిన రాముడు సంఘటన గురించి జిల్లా వ్యవసాయ శాఖ సంచాలకులు పిర్యాదు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో రైతు రాముడు పాల్గొన్నారు.