కోకో గింజల కొనుగోలు పై రైతు సంఘం ప్రతినిధులు,రైతులతో ముఖాముఖి
1 min read
జిల్లాఉద్యాన అధికారి డాక్టర్: ఎస్.రామ్మోహన్
800 నుంచి 1000 టన్నుల వరకు పాత కోకో గింజలు మిగిలిపోయాయి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లా ఉద్యాన అధికారి, ఏలూరు వారి కార్యాలయంలో రైతు సంఘం ప్రతినిధులు మరియు కోకో సాగుదారుల మరియు కోకో కొనుగోలు చేసే వివిధ కంపెనీ ప్రతినిధులతో ఆఫ్ సీజన్ లో పండించిన కోకో గింజలు కొనుగోలు గురించి గురవారం ముఖాముఖి చర్చలు జరిగాయని జిల్లా ఉద్యాన అధికారి, డా: యస్.రామ్మోహన్ తెలిపారు. జిల్లాల్లో సుమారు 800 నుంచి 1000 టన్నుల వరకు పాత కోకో గింజలు రైతుల వద్ద ఉండిపోయాయని వాటిని కోకో కొనుగోలు చేసే కంపెనీలు కొనుగోలు చేయడం లేదని రైతు సంఘ ప్రతినిధులు వాపోయారు. సదరు విషయాన్నీ కోకో గింజలు కొనుగోలు చేసే కంపెని ప్రతినిధులతో చర్చించినపుడు ప్రస్తుతం ఉన్న పాత కోకో గింజలలో పాడైపోయిన, తాలు గింజలు ఎక్కువగా ఉన్నాయని వాటిని గ్రేడింగ్ చేసి శుభ్రపరచిన తరువాత కొనుగోలు చేస్తామని తెలియచేయడం జరిగిందన్నారు. ఆఫ్ సీజనులో పాత కోకో గింజలు నిల్వ చేసిన రైతులు కొత్త గింజలతో (ఈ సీజన్ వి) కలపకూడదని తెలిపారు. ఆ విధంగా కలపడం వలన వివిధ కంపెని వారు కొనుగోలుచేయడం లేదు కనుక గ్రేడింగ్ చేసిన ఈ సీజనులో వచ్చిన (జనవరి నుండి ) కోకో గింజలను ప్రస్తుత ధరలను అనుసరించి రూ. 600/- చొప్పున అందరు కోకో కంపెని ప్రతినిధులు కొనుగోలు చేస్తున్నారన్నారు. పాత కోకో గింజలు మరియు క్రొత్త గింజలను వేరువేరుగా భద్రపరచుకోవాలని రైతులకు సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ విధంగా చేసిన పిమ్మట కోకో కంపెని ప్రతినిధులు కొనుగోలు చేయుటకు సిద్ధముగా ఉన్నారని ఆయన తెలిపారు.