జొన్నల కొనుగోలును తక్షణమే చేపట్టి రైతులను ఆదుకోవాలి
1 min read
నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన బొజ్జా దశరథరామిరెడ్డి
నంద్యాల, న్యూస్ నేడు: నంద్యాల జిల్లాలో రైతులు విస్తృతంగా జొన్న సాగు చేసారనీ అయితే బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువగా వుండటం వలన ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కి విజ్ఞప్తి చేశారు.గురువారం పాణ్యం, గడివేముల, గోస్పాడు మండల రైతులతో కలిసి జాయింట్ కలెక్టర్ కి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.జొన్నల కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పి మూడు వారాలు అయినప్పటికీ నేటి వరకు రైతుల దగ్గర నుండి సేకరణ ప్రారంభం కాకపోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. రైతులు తమ ధాన్యాన్ని తమ కల్లాలలోనే వుంచుకున్నారని ప్రస్తుతం అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు నష్టపోకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరంచాలని జాయింట్ కలెక్టర్ ని కోరారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ..జొన్నల సేకరణకు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వచ్చే వారం నుండి జొన్నల సేకరణ కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. అంతవరకు రైతులు వర్షాల నుండి తమ ధాన్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు.జాయింట్ కలెక్టర్ ని కలిసిన వారిలో గడివేముల మండలం గడిగరేవుల సర్పంచ్ హరినాథరెడ్డి, బలపనూరు మురళీధరరెడ్డి, యాళ్ళూరు గ్రామం P.దశరథరామిరెడ్డి మరియు పాణ్యం , గడివేముల, గోస్పాడు రైతులు పాల్గొన్నారు.