రైతులు బ్యాంక్ లలో తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలి…
1 min read
పి. రామచంద్రయ్య.
జీపు జాతా ను ప్రారంభిస్తున్న ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి. రామచంద్రయ్య
పత్తికొండ, న్యూస్ నేడు: రైతులు బ్యాంక్ లలో తీసుకున్న అన్ని రకాల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి. రామచంద్రయ్య డిమాండ్ చేశారు. ఈనెల 4 వ తేదీన కర్నూల్ లో జరిగే జాతీయ రైతు సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన జీపు జాతా ను పి. రామచంద్రయ్య జెండా ఊపి ప్రారంభించారు. జీపు జాత పత్తికొండ మండలంలోని గ్రామాలతో పాటు దేవనకొండ, ఆస్పరి మండలాలలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి అన్న, వస్త్రాలను అందించే రైతులను రక్షించాలంటే, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలంటే రైతులకు బ్యాంకులలో ఉన్న అన్ని రకాల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కు పార్లమెంట్ లో చట్టం తీసుకురావాలని, 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు నెలకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కోరారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈనెల 4న కర్నూల్ లో జరిగే జాతీయ రైతు సదస్సు కు రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్, ఏపీ రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి సురేంద్ర కుమార్, గౌరవ అధ్యక్షులు కారన్న, మండల కార్యదర్శి సిద్ద లింగప్ప, నాయకులు నాగిరెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.