రైతుకు రుణమాఫీ చేయాలని రైతు సంఘం ధర్నా
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ప్రతి సంవత్సరం కరువు నేపథ్యంలో అప్పుల పాలైన రైతుల రుణమాఫీ చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. పత్తికొండ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పత్తికొండలో స్థానిక చదువుల రామయ్య భవనం నుండి ఆర్ డి ఓ కార్యాలయం వరకు రైతులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నాగేంద్రయ్య జిల్లా ఉపాధ్యక్షులు డి రాజా సాహెబ్ మాట్లాడుతూ, రైతులు తీసుకున్న అన్ని బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని, పంటలు వేసి వర్షాలు రాక నష్టపోయిన రైతులకు నష్టపరిహారం రైతు యొక్క అకౌంట్లో జమ చేయాలని కోరారు.ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నదని రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు అలాగే కరువు తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్న డిమాందులతో నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రధానంగా రైతులకు రుణాలు భారంగా మారిన నేపథ్యంలో అవి తీర్చలేని పరిస్థితి దాపురించి అవమాన భారంతో ఆత్మహత్యలకు పాల్పడుతుండడం దురదృష్టకరమన్నారు. అందుకే రైతుల రుణాలన్నింటినీ రెండు లక్షల రూపాయల వరకు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అరకొర పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతు తీవ్ర నిరాశలో ఉన్నాడన్నారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలన్నారు. అప్పుడే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కుతుందన్నారు. రైతులకు సాగు సాయం కింద ఎకరాకు 15 వేల రూపాయలు ఇవ్వాలని కోరారు. కౌలు రైతులకు భూ యజమానితో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇచ్చి బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణం ఇవ్వాలన్నారు. అప్పుడే కౌలు రైతులు ఆత్మహత్యల ఆలోచన నుండి విముక్తులు అవుతారని అభిప్రాయపడ్డారు. కరువు తుఫాను వలన నష్టపోయిన రైతులకు తక్షణం ఇన్పుట్ సబ్సిడీని, పంటల బీమాను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు రెండు లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నబి రసూల్ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు ఉమాపతి సిపిఐ రైతు సంఘం నాయకులు కారన్న, గురుదాసు, సుల్తాన్, నాగరాజు, కృష్ణమూర్తి, అంజయ్య, ఉరుకుందు, రంగన్న, రామాంజనేయులు, నెట్టికంటయ్య, కండప్ప, భూపేష్, హోతురప్ప తదితరులు పాల్గొన్నారు.