PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తండ్రి కలెక్టర్.. తనయుడు అంగన్వాడీలో..

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కూలి నాలి చేసే తల్లిదండ్రులు సైతం తమ పిల్లలు ఉన్నత చదువులు చదవాలన్న ఆకాంక్షతో..లక్షలు పెట్టి కార్పొరేట్ పాఠశాలల్లో చదివించాలని ఆశ పడుతున్న ఈ రోజుల్లో..అన్నీ ఉండి సామాన్యుడి తరహాలో అంగన్వాడి పాఠశాలలో తన కుమారుడిని చేర్పించిన జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు అందరికీ ఆదర్శంగా నిలిచారని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. శుక్రవారం జిల్లా కలెక్టర్ తన కుమారుడు దివి ఆర్విన్ ను కర్నూలు నగరం లోని బుధవార పేట అంగన్వాడీ ప్రీ స్కూల్ లో చేర్పించారు. దివి ఆర్విన్  చక్కగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో కూర్చుని  రంగులు దిద్దుకుంటూ , ఆట వస్తువులతో ఆడుకుంటున్న దృశ్యాలు అందరినీ అలరించాయి. కార్పొరేట్ పాఠశాలల్లో కన్నా ప్రభుత్వ పాఠశాలలే మిన్న  అక్షర సత్యాన్ని కలెక్టర్ గుర్తించారు. మెరుగైన బోధన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా విధానంలో తీసుకొచ్చిన సమూలమైన మార్పులను గురించి కలెక్టర్ సమావేశాల్లో తరచు అధికారులతో చెప్తుంటారు .  అంగన్వాడి ప్రీ స్కూల్ లో పిల్లలకు పౌష్ఠికాహారం అందించడంతో పాటు విలువలను కూడా నేర్పించాలని ఇటీవల జరిగిన మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారుల సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు..అంగన్వాడీ కేంద్రాల్లో శిశువులకు  ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కలెక్టర్ తన కుమారుడిని బ్రాండ్ అంబాసిడర్ గా చేశారు. స్వతహాగా కలెక్టర్ పి. కోటేశ్వర రావు ఆర్భాటాలకు దూరంగా, నిరాడంబరంగా ఉంటారు . ఈ చర్యతో  అది నిరూపితం అయింది ..మాటల్లో కాకుండా చేతల్లో చూపించి, తన కుమారుడిని అంగన్వాడీ కేంద్రంలో చేర్పిస్తూ కలెక్టర్ తీసుకున్న నిర్ణయం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

About Author