3వ డివిజన్ లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం
1 min read
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి4 కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తాం
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హులందరికీ సొంతింటి కలసాకారం చేసే లక్ష్యంతో ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నామని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. సంతృప్తికర పాలనే ధ్యేయంగా పేదలను అన్నివిధాలా ఆదుకునేందుకు పి-4 కార్యక్రమాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష్యసాధన దిశగా కొనసాగుతోంది. ఇదేక్రమంలో శనివారం స్థానిక 3వ డివిజన్‌లో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఇంటింటి పర్యటనను ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని ప్రతి ఇంటికీ వెళ్ళిన ఎమ్మెల్యే చంటి ఏడాదికాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల లబ్ది వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వారికి వివరించీ, పథకాలు సక్రమంగా అందుతున్నదీ,లేనిదీ క్షేత్రస్థాయిలో ఆరాతీశారు. ఇదేక్రమంలో స్థానిక సమస్యలను కూడా అడిగి తెలుసుకుని, వాటిని కూడా సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇళ్ళులేని నిరుపేదలకు కేటాయించిన 3వేల ఇళ్ళ నిర్మాణాలను పూర్తిచేశామన్నారు. అక్టోబర్ నాటికి 9వేల ఇళ్ళను నిర్మించే లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే పేదరిక రేఖకు దిగువన ఉన్న పేదలకు ఆర్ధిక భరోసా కల్పించే లక్ష్యంతో చేపట్టిన బృహత్తర పి-4 కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించనున్నామన్న ఎమ్మెల్యే చంటి కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతోందని చెప్పారు. కార్యక్రమంలో ఈడా ఛైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, కో-ఆప్షన్ సభ్యులు ఎస్ యం ఆర్.పెదబాబు, బొద్దాని శ్రీనివాస్,రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు జాల సుమతి బాలాజీ, కూటమి నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
