రామాయణాన్ని తెలుగీకరించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ
1 min readజిల్లా కలెక్టర్ డా జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : సాంస్కృత రామాయణాన్ని తెలుగీకరించిన తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ రాసిన “మొల్ల రామాయణం” అని జిల్లా కలెక్టర్ డా జి.సృజన పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో రామాయణాన్ని తెలుగీకరించిన తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతిని పురస్కరించుకొని కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ చిత్ర పటానికి పూలమాల వేసి జిల్లా కలెక్టర్ డా.జి.సృజన నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ స్మృతిని తలుచుకుంటూ వారిని గౌరవించాల్సిన సందర్భం రావటం మనందరికీ ఎంతగానో సంతోషించదగిన విషయమన్నారు. వెనుకబడిన జాతిలో జన్మించి ఆరోజుల్లోనే సంస్కృతం అభ్యసించి తెలుగులో ఒక రామాయణాన్ని రచించి సమాజానికి ఇవ్వగలడం అనేది వారు వచ్చిన సామాజిక నేపథ్యంలో చాలా కష్టతరమైన విషయమని కలెక్టర్ పేర్కొన్నారు. మొల్లమాంబ గారు రాసిన మొల్ల రామాయణానికి ముందు, రామాయణాన్ని ప్రజలకు తెలియజేయడానికి రంగనాథ రామాయణం తప్ప ఇంకొకటి లేదన్నారు. వ్యవహారిక భాషలో రామాయణం అందరికీ అర్థమయ్యే విధంగా రామాయణాన్ని చక్కగా వివరించడంలో మొల్ల పాత్ర ఎంతో గొప్పదని కలెక్టర్ పేర్కొన్నారు. ఆ రోజుల్లో చదువు అందుబాటులో ఉండడమే చాలా తక్కువని, ఆడవారికైతే ఇంకా తక్కువగా ఉండేదని అటువంటి సందర్భాలలో ఎంత నిబద్ధత ఉంటే సాంస్కృతo అభ్యసించి తెలుగు వ్యాకరణాలు అన్ని తెలుసుకొని రామాయణం లాంటి మహా గ్రంధాన్ని తెలుగులోకి రచించగలిగి ప్రజలకు అందించడం అంటే చిన్న విషయం కాదన్నారు. ఇందుకోసం ఎన్నో పోరాటాలు, వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొని ఉండొచ్చునని అయినప్పటికీ సాంస్కృత విద్యను నేర్చుకొని తెలుగు వారందరికీ రామాయణం అందించాలనే ఒక దీక్ష చేపట్టడం గొప్ప విషయమన్నారు. ఈరోజు వారి జయంతి సందర్భంగా వారిని గౌరవించుకోవడం, వారి స్మృతిని తలుచుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణమన్నారు. ఎంతో కష్టపడి చదివి సమాజానికి ఒక మార్గాన్ని చూపించారో ఆ మార్గాన్ని మనమందరం మరవకుండా ఉండాలని కలెక్టర్ తెలిపారు.కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ జి.డి. కల్పన, డిఆర్ఓ మధుసూదనరావు, బీసీ సంక్షేమ అధికారి వెంకట లక్ష్మమ్మ, కుమ్మరి సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.