ఐదేళ్ల జీవితం ప్రజల చేతుల్లోనే… టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఐదేళ్ల బంగారు జీవితం ప్రజల చేతుల్లోనే ఉందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలో ప్రజలే ఆలోచించుకోవాలని చెప్పారు. కర్నూలు నగరంలోని జొహరాపురం అల్లా బకాష్ కాలనీలో ఆర్య మరాఠీ సంఘం నాయకులు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ టి.జి భరత్ సమక్షంలో పార్టీలో చేరారు. టిజి భరత్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ కర్నూల్లో తొమ్మిదిన్నర సంవత్సరాల పాలన ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలన్నారు. తన తండ్రి టి.జి వెంకటేష్ పాలనకు ఆ తర్వాత పాలనకు ఎంతో తేడా ఉందన్నారు. చిన్న చిన్న సమస్యలు పరిష్కరించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆర్య మరాఠీల కోరిక మేరకు రాజకీయాలతో సంబందం లేకుండా అమ్మవారి ఆలయ నిర్మాణం త్వరలోనే చేపడతానని భరత్ హామీ ఇచ్చారు. కర్నూలు ప్రజలకు సేవ చేసేందుకు తమ కుటుంబం ఎప్పుడూ ముందుంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని, కర్నూల్లో తాను ఎమ్మెల్యే అయితే అన్ని విధాలా అభివ్రుద్ది చేస్తానని హామీ ఇచ్చారు. టి.జి భరత్ మాట్లాడుతున్న సమయంలో ఓ మహిళ ముందుకు వచ్చి మాట్లాడుతూ తాను కరోనా సమయంలో పారిశుధ్య కార్మికురాలిగా పని చేశానని అయితే ఆతర్వాత తనను విధుల నుండి తొలగించారని ఆవేధన వ్యక్తం చేశారు. కొత్త వారిని విధుల్లోకి తీసుకొని తనకు అన్యాయం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా టి.జి భరత్ మాట్లాడుతూ తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలుకు పరిశ్రమలు తీసుకువచ్చి ఇక్కడే ఉద్యోగ, ఉపాది అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు బాబ్జీ, మోహన్, మాధవస్వామి, శాంతమ్మ, ఆర్య మరాఠీ సంఘం నేతలు శేఖర్, బాల్ రాజ్, బలరాం, గంగారం, చంద్రరాజ్, బ్రహ్మాజీ, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.