ఎగిరే హోటల్.. ఎప్పటికీ భూమ్మీదకు రాదు !
1 min readపల్లెవెలుగువెబ్ : సమీప భవిష్యత్తులో రూపుదిద్దుకోనున్న ఎగిరే హోటల్ ‘స్కై క్రూయిజ్’ గ్రాఫిక్స్ నమూనా ఇది. విమానంలా ఎగిరే అనుభూతిని, విలాసవంతమైన ఓడలో లభించే సకల సౌకర్యాలను ప్రయాణికులకు ఏకకాలంలో అందించగల బాహుబలి తరహా విమానమన్నమాట. సాధారణంగా ఎంత భారీ విమానమైనా కొన్ని గంటలపాటు ప్రయాణించాక కిందకు దిగడం అనివార్యం. అలాగే నెలల తరబడి సముద్రంపై ప్రయాణించే క్రూయిజ్ షిప్‌లు సైతం ఎక్కడో ఒకచోట లంగరు వేయక తప్పదు. కానీ యెమెన్‌కు చెందిన ప్రముఖ సైన్స్ ఇంజనీర్ హషీమ్ అల్–ఘాయిలీ యూట్యూబ్‌లో స్కై క్రూయిజ్ పేరిట తాజాగా విడుదల చేసిన ‘ఎగిరే హోటల్’ కంప్యూటర్ గ్రాఫిక్స్ వీడియో నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. వేలాది మంది ప్రయాణికులతో ఆకాశంలో ఏళ్ల తరబడి నిరంతరాయంగా ఎగరగలగడం దీని ప్రత్యేకతల్లో ఒకటి! పూర్తిగా కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ఎగిరే ఈ విమానంలో ఒకేసారి 5 వేల మంది అతిథులు ఆకాశయానం చేయొచ్చట!! ఇంత భారీ విమానం గాల్లో ఎగిరేందుకు వీలుగా అణు ఇంధనంతో నడిచే 20 ఇంజిన్లను దీనికోసం డిజైన్ చేశారు. ఇందుకోసం ఏకంగా ఓ చిన్నపాటి అణు రియాక్టర్‌నే ఇందులో ఏర్పాటు చేయనున్నారు.