పిల్లల పెరుగుదలపై దృష్టిసారించండి…
1 min read– జేసీ( అభివృద్ధి) మనజీర్ జిలానీ సమూన్
పల్లెవెలుగువెబ్, కర్నూలు : అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని ప్రతి బిడ్డ పెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) మనజీర్ జిలాని సమూన్ అధికారులను ఆదేశించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పురోగతిపై ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కే. ప్రవీణ అధ్యక్షతన కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సీడీపీఓలు, సూపర్ వైజర్లతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ( అభివృద్ధి) మనజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ పిల్లల్లో శారీరక దారుఢ్యం, ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొనేందుకే ప్రభుత్వం గ్రోత్ మానిటరింగ్‌ను అమలు చేస్తోందన్నారు. క్రమం తప్పకుండా పిల్లల ఎత్తులు, బరువులు తీయాలని వివరించారు. గ్రోత్ మానిటరింగ్‌ను సమర్ధవంతంగా అమలు చేస్తే ఎత్తుకు తగ్గ బరువు, వయస్సుకు తగ్గ ఎత్తు ఉండే పిల్లలను గుర్తించడం సులభమవుతుందన్నారు. పిల్లల పెరుగుదల పర్యవేక్షణ, పోషకాహారం, వ్యాధినిరోదక టీకాలు, రెఫరల్ సర్వీసులు, కౌన్సెలింగ్ తల్లిపాల ప్రాముఖ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ ఐదు అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.
ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిధిలో చేపట్టే కార్యక్రమాల్లో ఈ అంశాలపై అవగాహన పెంచాలన్నారు. ముఖ్యంగా పిల్లల్లో లోప పోషణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాబోయే రోజుల్లో లోప పోషణ లేని అంగన్వాడీ కేంద్రాలు, ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఉండేలా సిడిపిఓలు ప్రణాళికలు సిద్ధం చేసుకుని, గ్రామ స్థాయిలో అమలు చేయాలన్నారు. మాతృమరణాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే మహిళల్లో రక్తహీనతను నివారించాలన్నారు. గర్భం దాల్చిన నాటి నుంచే ప్రభుత్వం సరఫరా చేసే ఐ.ఎఫ్.ఏ ట్యాబ్లెట్ వినియోగిస్తున్నారా లేదా అనే అంశాన్ని నిర్ధారణ చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని సిడిపిఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.