మాదకద్రవ్యాల సమూల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించండి
1 min read
జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్
నంద్యాల, న్యూస్ నేడు: జిల్లాలో మాదకద్రవ్యాల సమూల నియంత్రణకు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించి పటిష్ట చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో మాదకద్రవ్యాల జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు, డిఆర్ఓ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల నియంత్రణ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించి పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాదకద్రవ్యాల నివారణ రవాణాను అరికట్టేందుకు ప్రణాళిక బద్ధంగా సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలలోని విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ప్రతి కాలేజీలో మాదకద్రవ్యాల నియంత్రణకు కళాశాల సిబ్బంది పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఫ్యాక్టరీలలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు పనిచేస్తున్నారని…గంజాయి ఇతర మాదక ద్రవ్యాలను ఫ్యాక్టరీల్లోకి అక్రమంగా తరలించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే సంబంధిత కార్మికులు మాదకద్రవ్యాలను సేవించకుండా ఫ్యాక్టరీల యజమానులు పక్కాగా తనిఖీలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఉన్న మెడికల్ దుకాణాల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా నిద్ర మాత్రలను విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోలర్ ను కలెక్టర్ ఆదేశించారు. మిర్చి సాగులో గంజాయి పండించే ప్రమాదం ఉందని వీటిని అరికట్టేందుకు సంబంధిత వ్యవసాయం ఉద్యాన వనాధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.జిల్లాలో ఉన్న పర్యాటక కేంద్రాలకు బయటి రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికుల నుండి మాదకద్రవ్యాలను రవాణా అయ్యే ప్రమాదం వుందని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 8 జాతీయ రహదారులు అనుసంధానం కావడం వల్ల జిల్లాకు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుందన్నారు వీటి ద్వారా సరఫరా అయ్యే రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖల సహకారంతో పటిష్ట చర్యలు తీసుకోనున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో సెబ్ సూపర్డెంట్ రవికుమార్, నంద్యాల, ఆత్మకూర్ ఆర్డీవోలు విశ్వనాధ్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.