PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గూగుల్ మ్యాప్స్ అనుసరిస్తూ.. వ‌ర‌ద‌లో చిక్కుకుపోయిన కుటుంబం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గూగుల్ మ్యాప్స్‌ను అనుసరిస్తూ వెళ్లిన ఓ కుటుంబం వరదలో చిక్కుకుపోయింది. వారిని రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది శ్రమ పడాల్సి వచ్చింది. తమిళనాడులో జరిగిందీ ఘటన. కర్ణాటకలోని సర్జాపూర్‌కు చెందిన రాజేశ్.. కుటుంబంతో కలిసి కారులో హోసూర్ వెళ్లాడు. పనులు ముగించుకున్న తర్వాత తిరిగి గ్రామానికి బయలుదేరాడు. అయితే, ఈసారి అతడు గూగుల్ మ్యాప్స్‌ను ఎంచుకున్నాడు. అది చూపించిన దారిలో పయనమయ్యాడు. అలా తమిళనాడు కృష్ణగిరి జిల్లాలోని బాగేపల్లి బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. అయితే, అక్కడి పరిస్థితులను పట్టించుకోకుండా మ్యాప్స్‌ను నమ్ముకుని అలానే ముందుకెళ్లాడు. ఆ తర్వాత కానీ అతడికి తాము ప్రమాదంలో పడినట్టు అర్థం కాలేదు. భారీ వరదలో తాము చిక్కుకుపోయామని గ్రహించి కారును వెనక్కి తిప్పేందుకు ప్రయత్నించాడు. అయితే, కారు చిక్కుకుపోవడంతో సాధ్యం కాలేదు. వెంటనే అప్రమత్తమైన రాజేశ్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. వారు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. భారీ క్రేన్లను ఉపయోగించి వరదలో చిక్కుకున్న కారును బయటకు తీసి వారిని రక్షించారు.

                                      

About Author