న్యాయం కోసం.. ఎడ్ల బండి పై సుప్రీం కోర్టుకు !
1 min readపల్లెవెలుగువెబ్ : తన చెల్లిని పెళ్లి చేసుకుని వదిలేసిన భర్త, ఆయన కుటుంబీకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ వ్యక్తి ఎడ్ల బండిపై ఢిల్లీలోని సుప్రీం కోర్టుకు బయలుదేరాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్లకు చెందిన నేలవెల్లి నాగదుర్గారావు చెల్లి నవ్యతను అదే మండలంలోని చందాపురానికి చెందిన కొంగర నరేంద్రనాథ్‌కు ఇచ్చి 2018లో వివాహం జరిపించారు. కట్నంగా నగదు, ఆభరణాలు, భూమి ఇచ్చారు. అయితే ఆమెను సరిగా చూసుకోకపోవడమే కాక నరేంద్రనాథ్, కుటుంబ సభ్యులు నవ్యతను బెదిరించి ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించుకుని గెంటేశారు. ఈ విషయమై చందర్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, నరేంద్రనాథ్ కుటుంబ సభ్యుల ఫొటోలతో ఎడ్లబండిపై ఫ్లెక్సీ ఏర్పాటుచేయగా రూ.50 లక్షలకు పరువునష్టం దావా వేశారని నాగదుర్గారావు తెలిపారు. ఈమేరకు సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు నాగదుర్గారావు చెల్లెలితో కలిసి ఎడ్లబండిపై ఢిల్లీ బయలుదేరారు.