మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత
1 min readపల్లెవెలుగు వెబ్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. ఉదయం ఆయనకు పల్స్ పడిపోవడంతో హైదరబాద్ లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. రోశయ్య వయసు 88 ఏళ్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన రోశయ్య .. 1933 జులై 4న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ పూర్తీ చేశారు. 1968లో తొలిసారి రోశయ్య శాసనమండలికి ఎన్నికయ్యారు. రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రైతు నాయకుడు ఎన్జీ రంగా శిష్యుడు. 1968,1974, 1990లలో కాంగ్రెస్ తరపున శాసనమండలికి ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి మంత్రి వర్గంలో ఆర్ అండ్ బీ, రవాణ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004-2009 కాలంలో చీరాల శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. చాలా మంది ముఖ్యమంత్రుల వద్ద వివిధ శాఖల మంత్రిగా ఆయన పనిచేశారు. రోశయ్య ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ కాలం ఆర్థిక మంత్రిగా పనిచేశారు. మొత్తం 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది.
రాజశేఖరరెడ్డి మరణంతో ..
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో 2009 సెప్టంబర్ 3న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పద్నాలుగు నెలలు సీఎంగా పని చేసి.. 2010 నవంబర్ 24న ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం తమిళనాడు గవర్నర్ గా కూడ పనిచేశారు.
ప్రముఖుల నివాళి :
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతికి పలువురు సంతాపం ప్రకటించారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పనిచేసిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. ఆయన సేవలు చిరస్మరణీయమని అభిప్రాయపడ్డారు.