NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలను మభ్య పెట్టేందుకే శంకుస్థాపనలు..

1 min read

కమిషన్లకు కక్కుర్తి పడే 24 శిలాఫలకాలు ఆవిష్కరణ

ఏలూరు టిడిపి ఇంచార్జ్ బడేటి చంటి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : గడచిన నాలుగేళ్ళ పది నెలల్లో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే ఆళ్ల నాని ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టేందుకు శంకుస్థాపనల పేరుతో శిలాఫలకాలను ఏర్పాటుచేస్తున్నారంటూ ఏలూరు టీడీపీ ఇంఛార్జ్ బడేటి చంటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల ఏలూరు నగరంలో పలు అభివృద్ధి పనులకు వేసిన శిలా ఫలకాలను టీడీపీ నాయకులు మంగళవారం సందర్శించారు. ఎన్నికల కోడ్ సమీపిస్తుండగా పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు అంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ గత నెల 6వ తేదీ నుంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు 24 శిలా ఫలకాలు ఆవిష్కరించారని, అయితే ఈ పనులన్నీ ఎప్పుడు ప్రారంభిస్తారు, కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారా తదితర వివరాలను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం కమీషన్లకు కక్కుర్తిపడి శిలా ఫలకాలను ఆవిష్కరిస్తున్నారని, ఈలోగా ఎలక్షన్ కోడ్ వస్తే కపట నాటకాలు ఆడి పనులు చేయకుండా తప్పించుకోవచ్చునన్న దుర్మార్గపు పన్నాగం దీని వెనుక ఉందని ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఈ నెల 10వ తేదీ లోపు పనులు ప్రారంభించని పక్షంలో ఆ తర్వాత శిలా ఫలకాలను తామే తొలగిస్తామన్నరు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పూజారి నిరంజన్, నేరుసు గంగరాజు, విజయలక్ష్మి చౌదరి, తగిరాల అరుణ సురేష్ తదితర మాజీ కార్పొరేటర్లు టిడిపి నాయకులు పాల్గొన్నారు.

About Author