సెంచురీ ఆస్పత్రిలో ఉచిత ఈఎన్‌టీ శిబిరం
1 min read* ప్రపంచ బధిరుల దినోత్సవం సందర్భంగా నిర్వహణ
* ముఖ్య అతిథులుగా నచ్చినవాడు సినిమా హీరో, హీరోయిన్లు
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : ప్రపంచ బధిరుల దినోత్సవం సందర్భంగా నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన సెంచురీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత ఈఎన్‌టీ శిబిరం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా నచ్చినవాడు సినిమా హీరో లక్ష్మణ్ చిన్నా, హీరోయిన్లు కావ్యా రమేష్, ప్రేరణా భట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సెంచురీ ఆస్పత్రికి చెందిన ఈఎన్‌టీ వైద్య నిపుణుడు డాక్టర్ చైతన్య మాట్లాడుతూ, “పుట్టినప్పటి నుంచే పిల్లలకు శబ్దాలు సరిగా వినపడుతున్నాయా లేదా అన్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. సాధారణంగా చిన్న పిల్లలు శబ్దం ఎటువైపు నుంచి వినపడితే అటువైపు తల, కళ్లు తిప్పుతారు. అలా తిప్పడాన్ని బట్టే వారి వినికిడి శక్తి ఎంత ఉందన్నదాన్ని తల్లిదండ్రులు అంచనా వేయగలగాలి. ఒకవేళ పిల్లలు ఎలాంటి శబ్దాలకూ స్పందించకపోతే వెంటనే వీలైనంత త్వరగా వాళ్లను ఈఎన్‌టీ వైద్యనిపుణుల వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేయించాలి. బంజారాహిల్స్‌లోని సెంచురీ ఆస్పత్రిలో చెవికి సంబంధించిన అన్ని రకాల పరీక్షలు ఉన్నాయి. ఇక్కడ వారికి తగిన పరీక్షలు చేసి, వారి వినికిడి శక్తిని అంచనా వేసి, అవసరమైతే శస్త్రచికిత్సలు కూడా చేస్తాం. వినికిడి శక్తి మెరుగుపడితేనే వాళ్లకు త్వరగా మాటలు, భాష వస్తాయి. అప్పుడే కమ్యూనికేషన్ కూడా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఆస్పత్రిలో అన్ని వయసుల వారికి వినికిడి శక్తికి సంబంధించిన పరీక్షలు చేస్తాం” అని చెప్పారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ, “ప్రతిరోజూ మనకు మాట్లాడటంతో పాటు వినడం కూడా చాలా ముఖ్యం. వింటేనే దాని గురించి మనం బాగా ఆలోచించగలం. మన శరీరంలో అన్ని భాగాలూ ముఖ్యమే. అలాగే చెవి కూడా చాలా ముఖ్యం. అది సరిగా పనిచేస్తోందో లేదో చిన్నతనం నుంచి పెద్దవయసు వచ్చేవరకూ ప్రతి సందర్భంలోనూ చెక్ చేసుకోవాలి. మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందుగా గూగుల్‌లో వెతకడం కాకుండా.. ఏ సమస్య వస్తే దానికి సంబంధించిన వైద్యుడి వద్దకు వెళ్లి తగిన పరీక్షలు చేయించుకుని నిర్ధారించుకోవడం ముఖ్యం” అని వివరించారు.నచ్చినవాడు సినిమా హీరో లక్ష్మణ్ చిన్నా, హీరోయిన్లు కావ్యా రమేష్, ప్రేరణా భట్ కూడా నిత్యజీవితంలో వినికిడి శక్తికి ఉండే ప్రాధాన్యం గురించి వివరించారు. అవతలివారు చెప్పే మాటలు సరిగా వినిపించుకోలేకపోతే అది చాలా సమస్యలకు దారితీస్తుందని, అందువల్ల ఏ వయసువారైనా తమకు సరిగా వినిపిస్తోందో లేదో అన్న విషయాన్ని సరిచూసుకుని, అవసరమైతే తగిన వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు.