PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా కిలో జొన్నలు

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల : జిల్లాలోని తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కేజీ జొన్నలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ పేర్కొన్నారు. సోమవారం నంద్యాల పట్టణంలోని 29వ వార్డు సాధిక్ నగర్ లో బియ్యం కార్డుదారులకు ఉచితంగా కిలో జొన్నలు పంపిణీ చేసే కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జాయింట్ కలెక్టర్ నిశాంతి. టి. నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, మైనారిటీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు హాబీబుల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండియూ వాహనాల ద్వారా జిల్లాలోని 5,33,000 తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కిలో జొన్నలు చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా నంద్యాల జిల్లాలో ప్రతి ఒక్క రేషన్ కార్డు దారుడికి కేజీ బియ్యం బదులు కేజీ జొన్నలు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. జాయింట్ కలెక్టర్ నిశాంతి. టి. మాట్లాడుతూ 2023వ సంవత్సరాన్ని ప్రభుత్వం అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో పౌర సరఫరాల సంస్థ నుంచి జిల్లాలో 2022-23 సంవత్సరంలో 2859.150 మెట్రిక్ టన్నుల జొన్నలను నంద్యాల జిల్లాలోని రైతుల నుంచి నేరుగా సేకరించామన్నారు. ఇందుకు రూ.8.55 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసామన్నారు. బలవర్థక ఆహార పదార్థమైన జొన్నలను ప్రతి ఒక్కరు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. భవిష్యత్తులో చిరుధాన్యాల పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, యంపీ, మున్సిపల్ ఛైర్పర్సన్ తదితరులు తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా జొన్నలు పంపిణీ చేశారు.

About Author