అందరికీ ఉచితంగా అందుబాటులో న్యాయసేవలు
1 min read– బనగానపల్లె జూనియర్ సివిల్ జడ్జి కిశోర్ కుమార్
– లీగల్ సెల్ అథారిటీ అధ్వరంలో ర్యాలీ
పల్లెవెలుగు , వెబ్ బనగానపల్లె : పట్టణంలో.న్యాయ సేవాసదస్సుల ద్వారాపేదలకు ఉచితంగా న్యాయ సేవలు అందించడమే లక్ష్యమని జూనియర్ సివిల్ న్యాయమూర్తి కిశోర్ కుమార్ అన్నారు. జాతీయ న్యాయసేవా దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక కోర్టు ప్రాంగణంలో లీగల్ సెల్ అథారిటీ కోఆర్డినేటర్ శ్రీమతి భారతి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కిషోర్ కుమార్ మాట్లాడుతూ న్యాయసేవాధికార సంస్థల చట్టం ద్వారా పేదలకు ఉచితంగా న్యాయం, సూచనలు, సలహాలు అందించడం అందుబాటులోకి వచ్చాయన్నారు. పేద వారికి సామాజిక న్యాయం కల్పించడమే ఈ చట్టం అభిమతమన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న వ్యక్తులకు, బలహీన వర్గాల ప్రజలకు యోగ్యత గల న్యాయ సేవలు అవకాశం కల్పించడం న్యాయసేవల ఉద్దేశ్యం ఆయన అన్నారు. అంతకు ముందు కోర్ట్ ప్రాంగణం నుంచి పెట్రోల్ బంక్ కూడలి వరకు నిర్వహించిన ర్యాలీలో జడ్జి కిషోర్ కుమార్, స్థానిక బార్ కౌన్సిల్ సభ్యులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, పెద్దఎత్తున కక్షిదారులు పాల్గొన్నారు. రాజీ మార్గమే రాజ మార్గమని, ఉచిత న్యాయం పొందటం పేదవారి హక్కని పేదరికం నీకు భారం,సేవా సంస్థ నీకు వరం అంటూ నినాదాలు చేస్తూ ప్లే కార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో జడ్జి కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఆర్థిక పరిస్థితుల లేక మరే ఇతర కారణాల వల్ల న్యాయం పొందే అవకాశం కొందరికి లేకుండా పోయే పరిస్థితి నివారించేందుకు న్యాయసేవాధికార సంస్థల చట్టం అమల్లోకి వచ్చిందని ప్రతి ఒక్కరు ఈ చట్టాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీనియర్ న్యాయవాదులు అజాంహుస్సేన్, శ్రీమతి ఈశ్వరమ్మ, రఘురామిరెడ్డిలు మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానులేనని, కోర్టులో కేసులతో ఇబ్బంది ఎదురయ్యేవారు ఉచిత న్యాయ సహాయం పొందవచ్చన్నారు. క్రిమినల్ కేసులతో పాటు అన్ని సివిల్ కేసులను వాయిదాలతో నిమిత్తం లేకుండా ఇరు వర్గాలు రాజీమార్గం ఎంచుకోవాలని అన్నారు. రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకుంటే ఉభయులూ కేసులో విజయం సాధిస్తారని, కేసుల సంఖ్య తగ్గి ప్రభుత్వంపై భారం తగ్గుతుందన్నారు.ఈ కార్యక్రమంలో బనగానపల్లె ఎస్సై శంకర్ నాయక్, న్యాయవాదుల సంఘం అధ్యక్ష,కార్యదర్శిలు టి జగన్నాథరెడ్డి,నరసింహారెడ్డి, మహిళ న్యాయవాది శ్రీమతి ఈశ్వరమ్మ, సీనియర్ న్యాయవాదులు ఎం పరశురామిరెడ్డి, టి మాధవరెడ్డి, ఎం రఘురామిరెడ్డి, ప్రకాష్ రెడ్డి, ఖాజా హుస్సేన్, అల్లావుద్దీన్, ముజాహిర్ హుస్సేన్, టి వెంకటేశం, బాబు పెద్ద సంఖ్యలో కక్షిదారులు పాల్గొన్నారు.