చింతలబస్తీలో ఉచిత వైద్యశిబిరం
1 min read– 150 మంది స్థానికులకు వైద్య పరీక్షలు, మందుల అందజేత
– సెంచురీ ఆస్పత్రి ఆధ్వర్యంలో శిబిరం నిర్వహణ
పల్లవెలుగు వెబ్ హైదరాబాద్: నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన సెంచురీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం ఖైరతాబాద్ సమీపంలోని చింతలబస్తీ వీర్‌నగర్ ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానికంగా ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ పార్కులో నిర్వహించిన ఈ శిబిరానికి సమీప ప్రాంతాలకు చెందిన 150 మంది వరకు ప్రజలు వచ్చి, వివిధ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వారందరికీ మధుమేహం, రక్తపోటు, ఎత్తు, బరువు, బీఎంఐ తదితర పరీక్షలు చేయడంతో పాటు సమస్యలు ఉన్నవారికి ఉచితంగా మందులు కూడా అందజేశారు. సెంచురీ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పర్వీన్ బాను ఆధ్వర్యంలో పలువురు వైద్య సిబ్బంది ఈ శిబిరంలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించిన ఈ శిబిరానికి యువతీయువకులు, వృద్ధులు, మహిళలు.. ఇలా అన్ని వయసులు, అన్ని వర్గాలకు చెందినవారు హాజరుకావడం విశేషం. ఈ సందర్భంగా సెంచురీ ఆస్పత్రి సీఈవో, ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ హేమంత్ కౌకుంట్ల మాట్లాడుతూ, ‘‘నిశ్చల జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలా రకాల అనారోగ్యాలు వస్తున్నాయి. వీటి బారి నుంచి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ కనీసం అరగంట పాటు నడవాలి. నడక ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఏ వయసువారైనా ఉదయం గానీ, సాయంత్రం గానీ వారికి వీలు ఉన్న సమయంలో ఒక్క అరగంట నడిస్తే చాలావరకు అనారోగ్యాలు దూరమవుతాయి. ఇక్కడకు వచ్చినవారిలో ప్రధానంగా వృద్ధులకు మోకాళ్ల నొప్పులు కనిపిస్తున్నాయి. మహిళల్లోనూ రుతుక్రమానికి సంబంధించిన సమస్యలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న యువత, మహిళల్లో రక్తహీనత ఎక్కువగా కనిపిస్తోంది. ఇది చాలా ప్రమాదకరం. పరీక్షలు ఉన్నాయన్న ఆందోళనతో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల యువతలో రక్తహీనత వస్తుంది. మంచి పోషకాహారం తీసుకోవడం, తగినంతగా నిద్రపోవడం చాలా ముఖ్యం. మహిళలు సైతం తమ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. కాస్త వయసు వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు తగిన వైద్య పరీక్షలు చేయించుకుంటూ, అవసరమైతే మందులు వాడాలి. జీవనశైలి మార్పులతోనే చాలావరకు మన ఆరోగ్యాన్ని సంరక్షించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సక్రియాత్మక జీవనశైలిని అలవర్చుకోవాలి’’ అని సూచించారు.