నల్లమల నుంచి హైదరాబాద్కు.. ఎర్రచందనం అక్రమ రవాణా
1 min read– 150 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
– ఇద్దరి అరెస్టు
– నగదు రూ. 22 లక్షలు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం
– నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి
పల్లెవెలుగు వెబ్, మహానంది: కర్నూలు, ప్రకాశం జిల్లా సరిహద్దు రహదారి నంద్యాల గిద్దలూరు ప్రాంతంలోని నల్లమల అటవీ ప్రాంతంలో నిల్వ ఉంచిన 150 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి తెలిపారు. ఇవి దాదాపు 2500 కేజీలు ఉన్నట్లు పేర్కొన్నారు. వీటితో పాటు 22 లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేస్తున్నట్లు తెలిపారు. గురువారం మహానందిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లమల అటవీ ప్రాంతం నుండి హైదరాబాద్ కు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. కడప జిల్లాకు చెందిన కాల మల్లు నాగూర్ భాష మరియు ఇదే జిల్లాకు చెందిన ఉప్పర్ గుంటరపల్లి ఎర్ర పల్లి కి చెందిన ఆడి పోయిన లక్ష్మీనారాయణను అరెస్టు చేసి 22 లక్షల రూపాయల నగదుతో పాటు మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నంద్యాల గిద్దలూరు రహదారిలోని అడవి ప్రాంతంలో ఎర్రచందనం డంపు ను స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు వెళ్లగా పోలీసులను చూసి నిందితులు పరార్ అవుతుండటంతో పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వీరికి సహకరించిన వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామన్నారు. అదుపులోకి తీసుకున్న ముద్దాయిలను కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా ఫారెస్ట్ సిబ్బంది పి.వి సాయికుమార్ ఎస్ఐ అయూబ్ మరియు రమణ , నంద్యాల రూరల్ సిఐ రవీంద్ర మరియు సిసిఎస్ సిఐ చంద్రబాబు, మహానంది ఎస్సై నాగార్జున రెడ్డి మరియు సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు.