పోలింగ్ సిబ్బంది ఈవిఎంలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలి
1 min readప్రిసైడింగ్ ఆఫీసర్ పిఓ డైరీ తప్పనిసరిగా వ్రాయాలి
జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు/మంత్రాలయం, ఆదోని : పోలింగ్ సిబ్బంది ఈవిఎంలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సెక్టోరల్ అధికారులకు, బిఎల్ఓలకు జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఆదేశించారు.మంత్రాలయం టిటిడి కళ్యాణ మండపం, ఆదోని రెడ్డీస్ హాలులో సాధారణ ఎన్నికలు-2024 నిర్వహణ పై బూత్ లెవెల్ స్థాయి అధికారులకు, సెక్టోరియల్ అధికారులకు, ఎంసిసి బృందాలకు నియోజకవర్గ స్థాయిలో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తో కలిసి డా.జి.సృజన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో అన్ని టీమ్స్ కు అవగాహన కల్పించేందుకు సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో అన్నిటికంటే ముఖ్యంగా జిల్లా యంత్రాంగం కానీ, అధికారులు కానీ పారదర్శకంగా, ఎవ్వరికీ నచ్చిన వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని ఎన్నికలు నిర్వహిస్తామన్న భరోసాను ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత కల్పించడం మన ప్రధాన బాధ్యత మన మీద ఉందన్నారు. ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి అధికారులంతా ఎన్నికల కమీషన్ ఆధ్వర్యంలో విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు. బిఎల్ఓలు ఎలక్ట్రోల్ రోల్ తయారీలో, డ్రాఫ్ట్ రోల్, ఫైనల్ రోల్ ప్రచురణలో చాలా ప్రముఖ పాత్ర పోషించడం జరిగిందన్నారు. ఎలక్ట్రోల్ రోల్ స్వచ్ఛంగా ఉండేందుకు గాను రోల్ లో ఎవ్వరీ పేరు ఉండాలి, ఉండకూడదు అనే దాని కోసం ఇంటింటి సర్వే నిర్వహించి వాటికి తగిన ఫార్మ్స్ ను సరైన డాక్యుమెంటేషన్ ఉండే విధంగా చూసుకోవాలన్నారు. అర్హులైన ఓటర్లు ఎవ్వరైనా ఇంకా నమోదు చేసుకోకపోతే, ఏప్రిల్ 15వ తేది వరకు ఓటర్ గా ఎన్రొల్ చేసుకోవచునన్నారు. తొలగింపులకు సంబంధించి మార్చి 16వ నాటికి ఏవైతే దరఖాస్తులు ఉన్నాయో వాటిని పరిశీలించి అనుమతితో తొలగించడం జరుగుతుందన్నారు. మార్చి 16వ తేది తరువాత వచ్చిన దరఖాస్తులను మార్క్డ్ కాఫీగా ఉంచుకోవడం జరుగుతుందన్నారు. ఫార్మ్స్ డిస్పోజల్ క్వాలిటీ సరిగ్గా ఉందా లేదా అని తనిఖీ చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్క మార్పులు, చేర్పులకు గాను దానికి సంబంధించి ఫార్మ్ ఉండాలి, దాని సంబంధించిన ఉత్తర్వులు కాపీ కూడా ఉండాలన్నారు. ఓటరుకు ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత మన మీద ఎంతగానే ఉందన్నారు. ఓటర్ లిస్టులో వారి పేరు తొలగించడం అనేది క్రిమినల్ చర్యలకు దారి తీయడం జరుగుతుందన్నారు. పోలింగ్ రోజున బిఎల్ఓలు, సెక్టార్ ఆఫీసర్లు ఈవిఎంలను ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఏ విధంగా తొలగించాలి, మాక్ పోల్, నిర్వహించడం, క్లియర్ చేయడం పై పూర్తి స్థాయి అవగాహన కలిగించేలా రిటర్నింగ్ అధికారులు, తహశీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు. సెక్టార్ ఆఫీసర్లు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల దారులపై అవగాహన కలగడంతో పాటు ఏవైనా మరమ్మత్తులు చేసుకునే బాధ్యత మన మీద ఉందన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఉన్న మౌలిక సదుపాయాలకు సంబంధించి పోలింగ్ కోసం వచ్చే ఓటర్స్ కంటే ముందు రోజే వచ్చి అక్కడే విధులు నిర్వహించే సిబ్బందిని కూడా దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయాలన్నారు. ఒకవేళ ఇంకా పోలింగ్ కేంద్రాలలో ఎటువంటి లోపాలు ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే అందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ పూర్తి అయ్యే రోజు సాయంత్రం బిఎల్ఓలు, సెక్టార్ ఆఫీసర్లు అన్ని పోలింగ్ కేంద్రాలలో పిఓ డైరీ 17(సి) ఖచ్చితంగా రాసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ పూర్తి అయిన వెంటనే ఎన్నికలకు సంబంధించిన సామగ్రి స్ట్రాంగ్ రూమ్ కు ఎటువంటి ఆలస్యం లేకుండా చేర్చాలన్నారు. డిస్పాచ్/రిసెప్షన్ రోజున పోలింగ్ సామగ్రి పోలింగ్ కేంద్రాలకు, పోలింగ్ కేంద్రాల స్ట్రాంగ్ రూమ్ నుంచి వేగవంతంగా చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్న హోర్డింగులపై ఉన్న బ్యానర్స్, పోస్టర్స్, గోడ మీద వ్రాతలు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన రహదారులు, హైవే రోడ్ల పక్కన ఉన్న హార్డింగులను, ప్రైవేటు భవనాలకు సంబంధించి వాటిపై ఉన్న హోర్డింగులను సమాన ప్రాతిపదికన అందరికీ కేటాయించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న హోర్డింగులను తప్ప కొత్తవి ఏర్పాటు చెయ్యకూడదన్నారు. భవనాలపై పోస్టరు ఏర్పాటుకు ఇంటి ఓనరు అనుమతితో ఎన్ని పోస్టర్లు, ఎన్ని ఇళ్ల మీద, ఎంత సెంటీమీటర్ల పొడువుతో ఏర్పాటు చేస్తున్నారని ఒక నివేదిక రూపంలో అందజేస్తూ రిటర్నింగ్ అధికారి నుండి అనుమతి తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రచార అనుమతుల కోసం “ఫస్ట్ ఇన్ – ఫస్ట్ ఔట్” ద్వారా అనుమతులు దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నరు. ఇంకా ఎన్నికలకు సంబంధించి సి-విజిల్, టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదును వంద నిమిషాల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఎన్నికల కమీషన్ ఈ సారి “Zero Violence, No Repoll” అనే నినాదంతో విజయవంతంగా ఓటు హక్కును అందరూ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మే 13వ తేది నాలుగవ విడతలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియలో అన్ని శాఖల సమన్వయంతో ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ స్థాయి అధికారులు, పోలీసు అధికారులు కూడా ఉంటారు కాబట్టి ఏదైనా సమాచారం వచ్చినప్పుడు వెంటనే సంబంధిత స్థలానికి వెళ్లకుండా స్థానిక పోలీసు అధికారులను సంప్రదించి సదరు విషయంపై ఆరా తీసి కనుక్కోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో అనుమతులకు సంబంధించి సువిధ పోర్టల్ లో దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతులు ఇవ్వడం జరుగుతుందని దీనిలో కూడా రెండు పార్టీలకు ఒకే సారి అనుమతులు ఇవ్వకుండా విడివిడిగా ఇవ్వడం ద్వారా గొడవలు నివారించే అవకాశం ఉంటుందన్నారు. ఎంసిసికి సంబంధించి పోలీసు, రెవెన్యూ కలిసి పని చేయాలన్నారు. ఎన్నికల సామగ్రి తరలింపుకు సంబంధించి డిస్పాచ్ సెంటర్ నుండి త్వరితగతిన సామగ్రిని త్వరితగతిన చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ రోజున సెక్టోరల్ ఆఫీసర్లు, లోకల్ పోలీసు ఆఫీసర్లకు అందుబాటులో ఉండడం వల్ల అనుకొని సంఘటనలు జరిగినప్పుడు స్థానిక పోలీసు సహకారంతో సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే మన ప్రధాన ధ్యేయం అని అన్నారు.సమావేశంలో ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, మంత్రాలయం రిటర్నింగ్ అధికారి మురళీధర్, ఆదోని ఏఆర్ఓ హసీనా సుల్తానా, ఆదోని మున్సిపల్ కమీషనర్ రామచంద్ర రెడ్డి, ఆదోని డిఎస్పీ శివ నారాయణ స్వామి, ఎంపిడిఓలు, తహశీల్దార్లు, విఎస్టీ, ఎస్ఎస్టి, బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు.