అధికారిక లాంచనాలతో ఎమ్మెల్సీ చల్లాకు అంత్యక్రియలు
1 min read– అంతిమయాత్రలో పాల్గొన్న అశేష జనవాహిని
– తుదివీడ్కోలులో పాల్గొని నివాళులర్పించిన రాజకీయ ప్రముఖులు
పల్లెవెలుగు, వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో అవుకు మండలం ఏపీ ఎమ్మెల్సీ స్వర్గీయ చల్లా భగీరథ రెడ్డి అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం కుటుంబసభ్యుల, చల్లా అభిమానుల, ప్రజల కన్నీటి వీడ్కోలు మధ్య అధికారిక లాంఛనాలతో ముగిశాయి. అస్వస్థత కారణంగా హైదరాబాదు ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆయన బౌతికకాయన్ని బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక అంబులెన్స్లో స్వగ్రామమైన అవుకు పట్టణానికి తీసుకవచ్చి చల్లా భవన్లో ప్రజల, చల్లా అభిమానుల, వైసిపి నాయకుల,కార్యకర్తల సందర్శనార్థం ఉంచారు. అదే రోజు మధ్యాహ్నం రాష్ట్ర సీఎం వై యెస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విమానంలో అవుకు వచ్చి చల్లా భగీరథరెడ్డి పార్థివదేహానికి నివాళులు అర్పించి, చల్లా కుటుంబసభ్యులను పరామర్శించి, ప్రగాఢసానుభూతి వ్యక్తంచేసి, వారికి అన్నివిధాల అండగా ఉంటానని ఓదార్చి వెళ్లారు. అయితే దివంగత యువనేత చల్లా భగీరథరెడ్డి అంతిమయాత్ర అధికారిక లాంఛనాలతో శుక్రవారం ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం సొంత ఫామ్ హౌస్లో సంప్రదాయం ప్రకారం శాస్త్రోక్తంగా అంత్యక్రియలు ముగిసాయి. చల్లా భవన్ నుంచి ప్రత్యేకంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన వాహనంపై చల్లా భగీరథరెడ్డి పార్థివదేహాన్ని ఉంచి సాగిన ఈ అంతిమయాత్ర పట్టణంలోని ప్రధాన వీధులగుండా సాగి చల్లా ఫార్మ్ హౌస్ చేరుకుంది. ఈ అంతిమ యాత్రలో దారిపొడవునా బారులుతీరిన అభిమానులు పెద్ద ఎత్తున నివాళర్పించారు. చల్లా అభిమానులు, ప్రజలు చల్లా అమర్ రహే అంటూ శోకతప్త హృదయాలతో అంతిమయాత్ర లో పాల్గొన్నారు. చల్లా ఫామ్ హౌస్ లో గత ఏడాది మృతి చెందిన తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి సమాధి పక్కనే ప్రభుత్వ లాంఛనాలతో చల్లా భగీరథరెడ్డి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబసభ్యులు చల్లా సూర్య ప్రకాష్ రెడ్డి, చల్లా రాజశేఖరరెడ్డి, చల్లా విజయ భాస్కరరెడ్డి, చల్లా అమర్నాథరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.