గంగమ్మ ఒడి చేరిన… గణపయ్య
1 min readగణనాథుడికి వీడ్కోలు పలికిన భక్తజనం
నగరంలో ఆరు చోట్ల వినాయకుడి నిమజ్జనం
పల్లెవెలుగు వెబ్: తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు అందుకున్న బొజ్జగణపయ్య గురువారం గంగమ్మ ఒడికి చేరుకున్నారు. అశేష భక్త బృందం ఉండ్రాలయ్యకు ఘనంగా వీడ్కోలు పలికారు. నగరంలోని రాంబొట్ల దేవాలయం వద్ద స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి గురువారం ఉదయం పూజలు చేసి నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ రాజ్య సభ సభ్యులు టీజీ వెంకటేష్, ఎంపీ డా. సంజీవ కుమార్, మేయర్ బీవై రామయ్య, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎంఏ హఫీజ్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నగరంలోని పలు చోట్ల ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
వైభవం.. నిమజ్జనోత్సవం..
నగరంలోని భారీ వినాయక విగ్రహాల నిమజ్జనానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పకడ్బందీగా చేసింది. రాంబొట్ల దేవాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహంతో ప్రారంభమైన నిమజ్జనోత్సవం.. రాత్రి 2 గంటల దాకా కొనసాగింది. నగరంలోని (వినాయక ఘట్) సత్యనారాయణ స్వామి దేవాలయం వద్ద రెండు, అయ్యప్ప స్వామి దేవాలయం వెనుక రెండు, స్వామినగర్ పార్క్ వద్ద ఒకటి, స్టాంటన్‌పురం వద్ద ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన ఘాట్లలో గణనాథులను నిమజ్జనం చేశారు. భారీ విగ్రహాల నిమజ్జనానికి 9 క్రేన్లు ఉపయోగించారు. వివిధ రూపాలలో ఉన్న శివపార్వతి పుత్రుడు గణపయ్యను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. చిన్నారులు, పెద్దలు ఆనందోత్సవాల మధ్య గణపయ్యకు వీడ్కోలు పలికారు.
అలరించిన.. నృత్య ప్రదర్శన..
నిమజ్జనోత్సవం సందర్భంగా వినాయక భజన మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. దాదాపు మూడు గంటలపాటు చిన్నారులు నృత్యప్రదర్శన చేశారు.
పోలీసు బందోబస్తు….
వినాయక నిమజ్జనోత్సవంలో ఎటువంటి ఆటంకాలు, ఘర్షణ జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశానుసారం పోలీసులు విగ్రహాల వద్ద దగ్గరుండి నిమజ్జనానికి తరలించారు. 2వేల మంది పోలీసు సిబ్బంది నిమజ్జన కార్యక్రమానికి బందోబస్తు నిర్వహించారు.
స్వచ్ఛంద.. సేవ..
వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులకు స్వచ్చంద సంస్థ నిర్వాహకులు సేవ చేశారు. పలు చోట్ల అన్నదానం, నీరు, మజ్జిగ పంపణీ చేశారు. కల్కి భగవాన్ సేవా సమితి నేతృత్వంలో వినాయకుడి దేవాలయం ఎదురుగా అన్నదానం ఏర్పాటు చేశారు. అదేవిధంగా గాయత్రి ఎస్టేట్ రోడ్డులో ఉచితంగా నీరు పంపిణీ చేశారు.