గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్దలతో, ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
1 min read
వినాయక ఉత్సవ సమితి జిల్లా కార్యదర్శి గోవర్ధన్ నాయుడు సూచన
పత్తికొండ , న్యూస్ నేడు : ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే గణేష్ ఉత్సవ వేడుకలను భక్తిశ్రద్దలతో ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు అన్ని మండలాలు, గ్రామాల పరిధిలోని నిర్వాహకులు సన్నద్ధం కావాలని కర్నూలు జిల్లా శ్రీగణేష్ మహోత్సవ కేంద్ర సమితి జిల్లా కార్యదర్శి గోవర్ధన్ నాయుడు కోరారు. శుక్రవారం ఆయన పత్తికొండలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఆగస్టు 27వతేదీన జరిగే వినాయక చవితి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఉత్సవ సమితి నిర్వాహకులు సిద్ధం కావాలని కోరారు. మండపాల ఏర్పాటుకు ముందస్తుగా పోలీసుల అనుమతి, కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. చివరి ఘట్టమైన వినాయక నిమజ్జన వేడుకలో ఎక్కడా అపశృతి జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు వహించాలన్నారు. జిల్లా గణేష్ ఉత్సవ కమిటీ సూచన మేరకు ఉత్సవాలు విజయవంతం అయ్యేందుకు ఉత్సవ మండపాల నిర్వాహకులు, అన్నిశాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కోరారు.