హంద్రీ బ్రిడ్జి వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించాలి.. టి.జి భరత్
1 min read– చెత్తను నిల్వ చేసే ప్రాంతాన్ని పరిశీలించిన టిడిపి నేతలు
– హంద్రీ నదిలో పేరుకుపోయిన చెత్త.. తద్వారా పెరిగిన హంద్రీ ఎత్తు
– వరద నీరు వస్తే శివారుకాలనీలకు పొంచి ఉన్న ప్రమాదం.. టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బుధవారపేట హంద్రీ బ్రిడ్జి వద్ద పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. శనివారం ఆ ప్రాంతాన్ని టిడిపి నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ ఇంటింటి వద్ద సేకరిస్తున్న చెత్తను హంద్రీ బ్రిడ్జికి ఇరువైపులా వేస్తున్నారని అయితే ఇక్కడి నుంచి మాత్రం తీసుకెళ్లడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అరకొరగా చెత్తను తీసుకెళ్తుండటంతో హంద్రీలో పూడిక పేరుకుపోయిందన్నారు. తద్వారా హంద్రీ ఎత్తు పెరిగిందన్నారు. దీని వల్ల హంద్రీకి నీరు వస్తే ఈ ప్రాంతాల్లోకి వరద వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ చెత్త వల్ల ప్రజలు కంపు వాసనతో అంటు వ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. వీధుల్లో చెత్త బాక్సులు పెట్టకపోవడం వల్ల ప్రజలు కాల్వల్లోనే చెత్తను వేస్తున్నారన్నారు. దీంతో కాల్వల్లో నీరు వెళ్లక చెత్తతో నిండిపోయిందన్నారు. అందుకే మున్సిపల్ కమిషనర్ స్పందించి వెంటనే ఈ ప్రాంతాన్ని పరిశీలించి సమస్యను పరిష్కరించాలన్నారు. హంద్రీలో చెత్త పేరుకుపోవడం వల్ల అంటు వ్యాధులతో పాటు వరద వచ్చినపుడు ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించాలని టిజి భరత్ కోరారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు పరమేష్, షేక్ జకియా అక్సారి, టిడిపి నేతలు, నౌషద్, అబ్బాస్, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.