ఎమ్మిగనూరులో…20న సీపీఐ జనరల్ బాడీ సమావేశం
1 min readపత్తికొండ: ఈనెల 20వ తేదీన సిపిఐ జిల్లా జనరల్ బాడీ సమావేశం ఎమ్మిగనూరు పట్టణంలోని కుర్ని కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్యలు హాజరవుతారని, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా సమితి సభ్యులు, మండల, పట్టణ, శాఖ కార్యదర్శులు, ప్రజాసంఘాల మండలాల బాధ్యులు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య పిలుపునిచ్చారు.గురువారం స్థానిక చదువుల రామయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి పదివేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలని, జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, ప్రధానంగా అధిక వర్షాలు, నకిలీ పత్తి విత్తనాల వలన తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఇప్పటికే పశ్చిమ ప్రాంతంలో పనులు లేక వలసలు పోతున్నారని, గ్రామాలలో తక్షణమే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను చేపట్టి వలసలను నివారించాలని డిమాండ్ చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు కావస్తున్న సాగునీటి ప్రాజెక్టులు వేదవతి, ఆర్డీఎస్ కుడి కాలువ, గుండ్రేవుల రిజర్వాయర్, పులి కనుమ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడంతో పెండింగ్ లో ఉన్నాయని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని, తదితర సమస్యలపై సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి డి.రాజా సాహెబ్, పట్టణ కార్యదర్శి ఎన్.రామాంజనేయులు, జిల్లా సమితి సభ్యులు కారన్న, మండల సహాయ కార్యదర్శి రంగన్న పాల్గొన్నారు.