రుణాల పేరిట చిత్తూరు జిల్లాలో ఘరానా మోసం..!
1 min readపల్లెవెలుగువెబ్, చిత్తూరు: వడ్డీలేని రుణాల పేరిట చిత్తూరు జిల్లాలో ఓ ముఠా ఘరానా మోసానికి పాల్పడింది. జిల్లాలోని తమిళనాడు సరిహద్దు ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని నలుగురు వ్యక్తులతో కూడిన ఓ ముఠా చిత్తూరు నగరంలో ఫైనాన్స్ కంపెనీ ఏర్పటు చేశామని, సదరు కంపెనీ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇస్తామంటూ జిల్లాలోని శ్రీకాళహస్తి, సత్యవీడు పరిసర ప్రాంతాలకు చెందిన పేదలను మభ్యపెట్టి ఒక్కో గ్రూపునకు రూ.50వేలు చొప్పున వడ్డీ లేని రుణాలు ఇస్తామని నమ్మబలికి మోసానికి తెరతీశారు. ఇందుకు ఆయా ప్రాంతాల పొదుపు మహిళల నుంచి రుణ నిర్వహణ ఫీజు కింద రూ.10వేల నుంచి రూ.15వేల దాకా వసూలు చేశారు. ఈమేరకు రెండు బ్యాంకుల్లో ముఠా సభ్యులకు సంబంధించిన ఖాతాల్లోని ఫోన్‌పే, బ్యాంక్ అకౌంట్ల నుంచి అధికమొత్తంలో సొమ్ము జమ చేయించుకున్నారు. ఈక్రమంలో రుణాలు ఇవ్వాలంటూ కొందరు మహిళలు ముఠా సభ్యులను సంప్రదిస్తే మాయమాటలతో కాలయాపన చేస్తూ.. కనిపించకుండా తిరుగుతున్నారు. దీంతో మోసపోయామని భావించిన సదరు మహిళలు పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు.