ఆత్మ రక్షణ కోసం బాలికలకు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఎంతో అవసరం
1 min read
ఉషూ క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేసిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ.
పల్లెవెలుగు, కర్నూలు : బాలికలకు ఆత్మ రక్షణ కోసం కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఎంతో అవసరమని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న తన క్లినిక్ లో జరిగిన కార్యక్రమంలో ఈనెల 20, 21వ తేదీల్లో రాజమండ్రిలో జరగనున్న ఖేల్ ఇండియా క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్తున్న 66 మంది ఉషు క్రీడాకారులకు ఆయన క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉషూ శిక్షకుడు టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ రాజమండ్రి లో జరిగే ఖేల్ ఇండియా క్రీడా పోటీల్లో జిల్లాకు చెందిన ఉషూ క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు .రాజమండ్రి లాంటి సుదూర ప్రాంతాలకు వెళుతున్న బాలికలు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. అలాగే కలుషితమైన నీరు తాగకుండా పరిశుభ్రమైన నీరు తాగాలని ఆయన కోరారు. కలుషితమైన నీరు తాగడం వల్ల టైఫాయిడ్, కలరా, జాండీస్, జీర్ణకోశ సంబంధ వ్యాధులు వస్తాయని వివరించారు. అలాగే ఆహారము విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని ,కలుషితమైన ఆహారం తినకుండా పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలని ఆయన సూచించారు. కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వివరించారు. అలాగే దోమ కాటుకు గురికాకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలన్నారు దోమ కాటుకు గురైతే డెంగీ, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడం వల్ల ఆత్మ రక్షణతో పాటు దేహదారుఢ్యం మెరుగుపడుతుందని వివరించారు. కరాటే సాధన చేసే క్రీడాకారుల్లో ఆత్మస్థైర్యం మెరుగుపడి ఏకాగ్రత కూడా పెరుగుతుందని వివరించారు. తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను ఆయన అభినందించారు. నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు తన వంతు సహకారం నిరంతరం అందిస్తానని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ స్పష్టం చేశారు.
