ఆ లింగం …గుట్టకు దారి వదలండి
1 min read
పల్లెవెలుగు , మహానంది: ఆ లింగం… గుట్టకు దారి వదలండి అని ఉన్నత స్థాయి అధికారి ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వాసనీయ సమాచారం. మహానంది దేవస్థానానికి సంబంధించిన 226 సర్వేనెంబర్ నుండి ప్రైవేటు వ్యక్తికి చెందిన పంట పొలానికి( లింగం… గుట్టకు) దారి వదలాలని అక్కడ శివరాత్రి పర్వదిన సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేస్తారని ఆదేశాల్లో పేర్కొన్నట్లు తెలుస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఆలయ భూమి నుండి రహదారి కోసం చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు మరలా కొత్తగా అన్నదానం పేరుతో దారి ఏర్పట్టుకోవడానికి ఒక ఉన్నత స్థాయి అధికారి మార్గము ఏర్పాటు చేయిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆలయ భూమిలో పార్కింగ్ కోసం స్థలాన్ని ఎంపిక చేసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వాహనాల రాకపోకల సందర్భంగా దుమ్ము ధూళి వచ్చే అవకాశం ఉంది, మరి అలాంటి ప్రదేశంలో లోపట అన్నదానం చేస్తామని దస్త్రాలు ముందుకు కదిలించడం.. ముందుచూపుగా రాజ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడమేనని ఆరోపణలు వినవస్తున్నాయి. క్షేత్రం చుట్టుపక్కల వివిధ రకాల కులాలకు సంబంధించి స్వచ్ఛందంగా అన్నదాన సత్రాలు నిర్వహిస్తుంటే లింగం గుంటకు మాత్రం ఆలయ భూమిలో దారిస్తే అక్కడ అన్నదానం చేస్తారని అధికారులు వత్తాసు పలకడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. ఆ ఉన్నత స్థాయి అధికారికి స్థానిక దేవాలయ శాఖ అధికారులు వత్తాసు పలుకుతారా లేక ఆలయ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడుతారా అనేది తేలాల్సి ఉంది.