PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిమాన్వితుడు శ్రీ లక్ష్మీ రంగనాధుడు..!

1 min read

– ఏప్రిల్ 5న శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి రథోత్సవం.
– రైతు తిరునాళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ది .
– ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు..
– రైతులకు వ్యవసాయ పనిముట్లు లభ్యం.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: కరువు కాటకాలు, అధర్మం ప్రజ్వరిల్లిన చోట తాను వివిధ రూపాల్లో అవతరిస్తానని మహావిష్ణు ప్రబోధించారు. నారాయణ తత్వం లో భాగంగా ప్రతి యుగంలో వివిధ పేర్లతో దర్శనం ఇస్తానని మహావిష్ణువు భక్తులకు ఉపదేశించారు. అందులో భాగంగానే మహా మహిమాన్వితమైన శ్రీ లక్ష్మీ రంగనాథుడు( ఉమ్మడి కర్నూలు)నంద్యాల జిల్లాలోని జూపాడు బంగ్లా మండలం నందికొట్కూరు పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో తర్తూరు గ్రామంలో కొలువై ఉన్నాడు.ఈ ఏడాది స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సర చైత్ర మాస శుద్ధ అష్టమీలుగా మార్చి 29 బుధవారం నుండి ఏప్రిల్ 7 వ తేదీ చైత్ర బహుళ తదియ గురువారం వరకు శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ సమేత రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
స్వామి వారి చరిత్ర …
ఆరు దశాబ్దాల కిందట తర్తూరు గ్రామంలోని పురపాల రాజా రెడ్డికి మహబూబ్ మహబూబ్ నగర్ జిల్లా శ్రీరంగాపురం గ్రామానికి చెందిన రంగమ్మ తో వివాహం అయింది. ఆమె పుట్టింటి వారు ఆమెకు ఒడిబియ్యంలో సారే గా పసుపు, కుంకుమ, అద్దం, దువ్వెన, కుంకుమ భరణి, రవిక గుడ్డలు ఒడిలో ఉంచి అత్తారింటికి పంపారు. నడక దారిలో ప్రయాణం సాగిస్తున్న తరుణంలో కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒడి బియ్యం బరువు పెరగడం సాగిందట. తర్తూరు లో అత్తారింటికి చేరిన తర్వాత రంగమ్మ ఇంటి గడపను పసుపు కుంకుమతో పూజిస్తూ బరువుగా ఉన్న ఒడిబియ్యం మూటను విప్పి పరీక్షించగా అందులో పవళించిన శ్రీరంగం రంగనాథ స్వామి చెక్క బొమ్మ తో కనిపించాడు. ఇది చూసిన రంగమ్మ భర్త రాజారెడ్డి కోపంతో శ్రీ రంగనాధుని చెక్క బొమ్మను ఎద్దులగాట్లొకీ విసిరి వేశాడట. కొన్ని రోజుల పాటు ఎద్దుల గాడిపాడు లో ఉన్న శ్రీరంగనాథుడు రాజా రెడ్డికి కలలో కనిపించి నీ భార్యతో శ్రీరంగనాథుని ఉత్సవాలు జరిపించమని చెప్పి అదృశ్యమయ్యాడు. ఈ విషయమై ఏమి పట్టించుకోకపోవడంతో వారి కుటుంబం కరువు కాటకాలతో పశువులు మృతి చెందాయి. పంటలు చేతికి రాలేదు. ఇంట్లో వాళ్ళు రోగాల పాలయ్యారు. ఇది గమనించిన రాజారెడ్డి ఎద్దుల గాడి పాడు లో ఉన్న శ్రీరంగనాధుని పూజ గదిలో ఉంచి ఉత్సవాలు జరిపించాడు. ఆనవాయితీగా 600 ఏళ్ల కిందట నుంచి ప్రతి ఏడాది ఇది శ్రీరంగనాథుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆలయ అభివృద్ధికి ఉత్సవాల నిర్వహణకు 30 ఎకరాల మాన్యాన్ని గ్రామస్తులు కేటాయించారు. రెండేళ్లు కరోనా ప్రభావంతో బ్రహ్మోత్సవాలు అరకొరగా నిర్వహించారు. దీంతో భక్తుల రాక వెలవెలపోయింది స్వామి దర్శనం కోసం భక్తులు రెండేళ్లు నిరీక్షించారు. గత ఏడాది కరోనా ప్రభావం లేకపోవడంతో అధికారులు బ్రహ్మోత్సవాలను నిర్వహించారు.అకాల వర్షాలతో జాతర వెలవెల పోయింది .
రైతు జాతరగా ప్రసిద్ధి…
తర్తూ రు రంగనాథ స్వామి తిరునాళ్ల రైతు తిరునాళ్ల గా పేరుగాంచింది. ఈ తిరుణాల రైతులకు నెలవుగా మారింది. బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో రైతులకు ఉపయోగకరమైన వ్యవసాయ పనిముట్లు, మహిళలకు వంట సామాగ్రి లభ్యమవుతున్నాయి. కొత్త ఎద్దులను కొనడం పాత ఎద్దులను అమ్మడం ఈ తిరుణాలలో ప్రత్యేకత. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు తమ వ్యవసాయ కాలాన్ని పాలేరులను (జీత గాళ్ళను) నియమించుకోవడానికి తర్తూరు తిరుణాలను ఆది, అంత్య కాల పరిమితి గా నిర్ణయించుకుంటారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న రథోత్సవం ఆడంబరంగా జరిగిందంటే ఆ ఏడాది పంటలు పుష్కలంగా పండుతాయని రైతన్నల నమ్మకం.
చిన్నారులకు ఊరట..
తిరుణాలలో వివిధ రకాల చిన్నారులను ఉత్సాహపరిచే జెయింట్ వీల్ సర్కస్ తదితర తదితర ఉత్సాహవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నందికొట్కూరు చుట్టుపక్కల ప్రాంతవాసులు ఇక్కడ దొరికే కడ్డీల మాంసాహారాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. జాతరలో జరిగే ఎద్దులు బండలాగుడు పోటీలలో రెండు తెలుగు రాష్ట్రాల పోటీదారులు పాల్గొంటారు. ఈ పోటీలను తిలకించేందుకు జిల్లా వ్యాప్తంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివస్తారు.
బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ..
మార్చి 29వ బుధవారం తేదీన పూల సఫారీ ఉత్సవం బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈరోజు స్వామి వారిని ని పెళ్ళి కుమారుని చేసి అలంకరిస్తారు.
30వ తేదీన గురువారం సింహవాహన సేవ స్వామి వారిని చెక్కతో చేసిన సింహం పై ఊరేగింపు చేస్తారు.
31వ తేదీన శుక్రవారం హంస వాహన సేవ స్వామి ఉత్సవమూర్తిని హంసపై ఊరేగిస్తారు.
ఏప్రిల్ 1వ తేదీన శనివారం శేష వాహన సేవ స్వామిని నాగేంద్రుని పై ఊరేగిస్తారు.
2 వ తేదీన ఆదివారం హనుమద్వాహన సేవ స్వామిని ఆంజనేయ స్వామి భుజస్కంధాలపై ఊరేగించారు.
3 వ తేదీన సోమవారం గరుడ వాహన సేవ స్వామిని గరుడ గరుడ పక్షి పై ఊరేగి స్తారు.
4 వ తేదీన మంగళవారం గజవాహన సేవ స్వామిని ని ఏనుగు పై ఊరేగిస్తారు.
5 వ తేదీన బుధవారం దివ్య మంగళ రథోత్సవం శ్రీ లక్ష్మీ రంగనాథుని రథంలో భక్తులు తాడు లాగుతూ ఊరేగిస్తారు.
ఉత్సవమూర్తులను 6 వ తేదీన గురువారం అశ్వ వాహనసేవ పార్వేట ఉత్సవం స్వామిని గుర్రంపై ఊరేగిస్తారు.
7 వ తేదీన శుక్రవారం వసంతోత్సవం ఈరోజు బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా వివిధ రకాల రంగులు చల్లుకుంటూ ఆనంద కేలి నిర్వహిస్తారు.భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తాం.బొమ్మన ప్రతాపరెడ్డి. ఆలయ కమిటీ చైర్మన్.ఏ.డి.వెంకటరమణ. కార్యనిర్వహణాధికారి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. వేసవికాలంలో సేద తీరేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నాం. వికలాంగులు వృద్ధులకు నేరుగా స్వామి దర్శనం కల్పిస్తాం. ప్రత్యేక సేవలు చేసే భక్తులకు వసతులు కల్పిస్తున్నాం. తాగునీటి వసతి, రహదారులు తదితర వసతులకు కల్పించడానికి అన్ని శాఖల అధికారులకు తగిన సూచనలు చేశాం. భక్తులకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా దేవాదాయ శాఖ కార్యాలయ సిబ్బందిని సంప్రదించాలని కోరారు.

About Author