వైభవం..పాగాలంకరణోత్సవం
1 min read– ముగిసిన శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వాముల కళ్యాణోత్సవం
– వేడుకల్లో పాల్గొన్న 85,000 మంది భక్తులు
– నేడు అమ్మవార్ల రథోత్సవం
– 14 న ముగియనున్న శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం, పల్లెవెలుగు,
శ్రీశైల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం అర్ధరాత్రి అశేష భక్తజనుల మధ్య పాగాలంకరణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు శ్రీశైలం దేవస్థానంలో ఈ.ఓ రామారావు నేతృత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నంది వాహన సేవ, స్వామి వారి ఆలయ శిఖరానికి, నవనందుల పాగాలంకారణ, లింగోద్భవ దర్శనం వీక్షించిన భక్తులు పునీతులయ్యారు. తెల్లవారుజామున 3 గంటల వరకు శ్రీ మల్లికార్జున స్వామి మరియు శ్రీ భ్రమరాంబిక అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు. వేడుకల్లో మంత్రి అవంతి శ్రీనివాస్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ మోహన్, పంచాయతీ రాజ్ కమీషనర్ గిరిజా శంకర్, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డా.ఫక్కీరప్ప, ఈ.ఓ రామారావు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి వేడుకల్లో దాదాపు 85,000 మంది భక్తులు పాల్గొన్నట్లు ఈ.ఓ.రామారావు తెలిపారు.