వైభవం.. పాగాలంకరణోత్సవం..
1 min readశివ నామస్మరణతో మార్మోగిన శ్రీశైల క్షేత్రం
అశేష భక్తజన వాహిని మధ్య భక్తిశ్రద్ధలతో పాగాలంకరణ, లింగోద్భవ మహన్యాస రుద్రాభిషేకం
వేడుకలకు హాజరైన జిల్లా కలెక్టర్, శ్రీశైలం ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, జిల్లా జడ్జి, జిల్లా ఎస్పీ, జె సి లు
కర్నూలు/ శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామివారికి పాగాలంకరణ ఘనంగా ముగిసింది. మంగళవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలమహాక్షేత్రంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం లింగోద్భవం సమయంలో చీరాల వాస్తవ్యులు పృధ్వి వెంకటేశ్వర్లు ఎంతో నిష్టతో భక్తిశ్రద్ధలతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున అమ్మ వార్లను తలుచుకుంటూ స్వామివారికి పాగా చుట్టి అలంకరించారు. రోజుకు మూర చొప్పున నేత నేస్తూ 365 రోజులు పాటు తయారు చేసిన పాగాను స్వామివారికి సమర్పించి ఆలయ సాంప్రదాయబద్ధంగా పాగాను అలంకరించారు. ఈ పాగాలంకరణ ఘట్టం దాదాపు రెండు గంటలు పాటు జరిగింది. ఈ ఘట్టంలో భక్తులు శివనామస్మరణతో శ్రీశైల మహా పుణ్యక్షేత్రం మారుమోగింది.
కమణీయం.. కళ్యాణోత్సవం..
అనంతరం రమణీయం… కమనీయం గా నయనానందకరంగా నాగలకట్ట సమీపంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల కల్యాణ తంతు వైభవోపేతంగా సాంప్రదాయ రీతిలో జరిగింది. అశేష భక్త జనవాహిని మధ్య కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగాయి. ఈ ఉత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జిల్లా జడ్జి డాక్టర్ వి. రాధాకృష్ణ కృపా సాగర్, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, శ్రీశైల దేవస్థానం బ్రహ్మోత్సవాల స్పెషల్ ఆఫీసర్ ఎస్ ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి లవన్న, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎం కె వి శ్రీనివాసులు, ఇతర ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.