మరింతగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
1 min read
సంబంధిత అధికారులను అప్రమత్తం చేసిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్
నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించాలని అధికారులకు ఆదేశం
ఎప్పటికప్పుడు పరిస్థితిని ఫోన్లో జిల్లా యంత్రాంగంతో సమీక్షిస్తున్న ఎంపీ
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : గోదావరి ఎగువన మహారాష్ట్ర,తెలంగాణ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో క్రమంగా పెరుగుతున్న వరద ఉధృతి నేపథ్యంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అధికారులను అప్రమత్తం చేశారు. గోదావరి నదికి నీటిమట్టం మరింత పెరుగుతున్న నేపథ్యంలో నిర్వాసితుల పునరావాస కేంద్రాలకు తరలించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా ఎంపీ పుట్టా మహేష్ ఎప్పటికప్పుడు పరిస్థితిని ఫోన్లో మాట్లాడుతూ జిల్లా యంత్రాంగంతో సమీక్షిస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఎంపీ సూచించారు. వరద ఉధృతి తగ్గేవరకు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఎంపీ పుట్టా మహేష్ సూచించారు. నది పరివాహక ప్రాంతాల వైపు ప్రజలు ఎవరు వెళ్లకుండా నిరంతరం గస్తీ ఉండేలా ప్రత్యేకంగా సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల కనీస అవసరాలు అయినా తాగునీరు, మందులు వంటివి అందుబాటులో ఉంచాలని ఎంపీ అధికారులకు సూచించారు. ముఖ్యంగా కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, అధికారుల సూచనలు పాటించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.