తితిదే ఆధ్వర్యంలో గోపూజా మహోత్సవం
1 min readపల్లవెలుగు వెబ్ కర్నూలు: కనుమ పండుగను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కర్నూలు శివారులోని మామిదాలపాడు వద్ద వెలసిన గోదా గోకులం నందు గోపూజ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా గోవును పసుపు, కుంకుమ, గంధం, పూల మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి, మేళతాళాలతో, కోలాటం భజనలతో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాగోకులం వ్యవస్థాపకులు మారం నాగరాజు గుప్త మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశము, భారతదేశానికి గ్రామము, గ్రామానికి రైతు, రైతుకు గోవు వెన్నెముక అని, అటువంటి గోసంరక్షణ వ్యక్తి ధర్మమే కాదు కుటుంబ ధర్మం సమాజ ధర్మమని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం శ్రీ శ్రీ శ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామీజీ వారి మంగళాశాసనములతో వేదపండితులు టి.రమేషాచార్యులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పల్లెర్ల నాగరాజు, విశ్రాంత ఔషధ నియంత్రణాధికారి డాక్టర్ తల్లం నాగ నారాయణరావు, తితిదే ధర్మప్రచార మండలి సభ్యులు పాలాది సుబ్రహ్మణ్యం, గోదాపరివారం, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డితో పాటు వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.