PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిరుధాన్యాల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం..

1 min read

– సెకండరీ మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు

– కర్నూలు లో జిల్లా ఆదోని మండలం చిన్న పెండేకల్  గ్రామం వద్ద  రూ. 4.41 కోట్లతో ఏర్పాటు

– జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన

పల్లెవెలుగు వెబ్  కర్నూలు:  చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం  సెకండరీ మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లను  ఏర్పాటు చేస్తోందని  జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన పేర్కొన్నారు.ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ లో భాగంగా రాష్ట్రంలో  13 సెకండరీ మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  క్యాంపు కార్యాలయం నుండి  వర్చువల్ గా శంకుస్థాపన చేశారు.. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్న పెండేకల్  గ్రామం వద్ద  రూ. 4.41 కోట్లతో ఏర్పాటు చేయనున్న  సెకండరీ మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ కు  ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.శంకుస్థాపన అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిరుధాన్యాలు పండించే  రైతులకు   సెకండరీ మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్  ఏర్పాటు ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు..కర్నూలు జిల్లా  పశ్చిమ ప్రాంతంలో  జొన్నలు, కొర్రలు, సజ్జలను ఎక్కువగా పండించడం జరుగుతోందని, అందువల్ల ఆదోని ప్రాంతంలో చిరు ధాన్యాలు సాగు చేసే రైతులకు ప్రోత్సాహకంగా ఈ యూనిట్ ను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు..ఈ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా  కొర్ర ,జొన్న, సజ్జలను  పౌడర్ చేసి మిల్లెట్ ఫ్లోర్,  బిస్కెట్స్, మిల్లెట్ ఫ్లేక్స్, వర్మి సెల్లి, నూడిల్స్ తదితర విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్  చేయడం జరుగుతుందన్నారు.. తద్వారా రైతుల ఆదాయాన్ని మరింత పెంచి వారి  జీవనోపాధిని మెరుగుపరచడంతో పాటు మిల్లెట్ల వాడకంతో ప్రజల ఆరోగ్యం కూడా బాగుపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు..ఈ ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా పరిసర ప్రాంతాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు.కర్నూలు ఎంపీ డా.సంజీవ్ కుమార్ మాట్లాడుతూ వెనుకబడిన  ఆదోని ప్రాంతంలో ఇలాంటి ప్రాసెసింగ్ యూనిట్ల అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు..ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా రైతులకు మేలు జరగడంతో ప్రజలకు ఆరోగ్య పరంగా కూడా ఎంతగానో ఉపయోగం ఉంటుందని ఎంపీ తెలిపారు. కోడుమూరు ఎమ్మెల్యే డా. జె.సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా  ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్  నారపురెడ్డి మౌర్య, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి,ఏపి ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమా దేవి, డిఆర్డిఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగశివలీల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రామచంద్రయ్య జిల్లా ఉద్యాన శాఖ అధికారి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

About Author