ధాన్యం.. రైస్ మిల్లులకు పంపండి..
1 min read– కొనుగోలు కేంద్రం వద్ద నిలబెట్టొద్దు..
– అధికారులను ఆదేశించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
పల్లెవెలుగు వెబ్, మహబూబ్నగర్ : కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిలబెట్టవద్దని, వెంటనే రైస్ మిల్లులకు పంపాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.కోటి 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న రూరల్ స్లాటర్ హౌస్ కు, 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఓపెన్ జిమ్ కు శంకుస్థాపన చేశారు. లారీలు, స్థలం కొరత కారణంగా 8 రోజులుగా కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం తరలించడంలేదని రైతులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో.. వెంటనే అందుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. లారీలు, స్థలం కొరత తదితర అంశాలను పక్కనబెట్టి .. వెంటనే ధాన్యంను రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. సమస్య రాకుండా రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి రైతులకు సూచించారు.
లక్షణాలు ఉంటే.. వైద్యలను సంప్రదించండి
కరోన లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రజలకు సూచించారు. ప్రభుత్వం ఇంటింటికి ఫీవర్ సర్వే చేయిస్తోందని, సర్వేలో పూర్తి సమాచారం అందించాలని కోరారు. దగ్గు, గొంతునొప్పి, జ్వరం లాంటి వి ఉన్నవాళ్ళు మాత్రమే కరోనా పరీక్షలు చేయించుకోవాలని, ప్రతి ఒక్కరు పరీక్షలకోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రికి రావద్దని , దీనివల్ల కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పరీక్షలను పరిమితం చేసిందని ఆయన తెలిపారు. కరోనా పట్ల భయపడకుండా ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి శ్రీనివాస గౌడ్ ఈ సందర్భంగా కోరారు. జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు, ఎంపీపీ బాలరాజు, జెడ్ పి టి సి ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు ఉన్నారు.