PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా శ్రీచౌడేశ్వరీమాత జ్యోతి మహోత్సవం

1 min read

– కనులపండువుగా 360 జ్యోతుల ఊరేగింపు
– అంగరంగవైభవంగా రథోత్సవం
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండల పరిధిలోని నందవరం గ్రామంలో వెలసిన శ్రీ కాశీ విశాలాక్ష్మి ప్రతిరూపమైన శ్రీ చౌడేశ్వరీమాత శనివారం అర్ధరాత్రి ప్రారంభమైన జ్యోతి ఉత్సవం ఆదివారం ఉదయం జ్యోతులన్నీ అమ్మవారి సన్నిధికి చేరుకోవడంతో ముగిసింది. ఆలయ కార్యనిర్వాహణాధికారి విల్ఎన్ రామానుజన్ ఆధ్వర్యంలో ఈ జ్యోతి ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున శ్రీవిశ్వబ్రాహ్మణ భాస్కరయ్య అమ్మవారికి దృష్టి చుక్క పెట్టడం, అమ్మవారి ఆలయం ఎదురుగా మంటలను రాజేయడం ద్వారా జ్యోతి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. అనంతరం ఈఓ రామానుజన్, ఆలయ కమిటీ వహీకర్త రాజేశ్వరరావు గ్రామంలోని జ్యోతి మండపం వద్దకు వెళ్లి పూజలు నిర్వహించి జ్యోతి ఉత్సవాన్ని ప్రారంభించారు. అమ్మవారికి మొక్కు చెల్లించేవారు గోధుమపిండి, నెయ్యి ద్రవ్యాలతో జ్యోతిని తయారుచేసి, వివిధారకలుగా అలంకరించి దానిని తలపై వుంచుకుని వాద్య బృందంతో లయబద్దంగా నృత్యం చేస్తూ భక్తిగీతాలు ఆలాపిస్తూ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. తెల్లవారుజామున 2 నుంచి ఉదయం 8 గంటల వరకూ జ్యోతి ఉత్సవం కొనసాగింది. భక్తులు అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన అగ్నిగుండంలో దిగి ఆపై జ్యోతితో అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పూజలు, గర్భాలయ ప్రవేశాన్ని తాత్కాలికంగా రద్దు చేసి కేవలం అమ్మవారి దర్శనాన్ని మాత్రమే కల్పించారు. జ్యోతి ఉత్సవంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుండా బనగానపల్లె సిఐ సుబ్బరాయుడు, నందివర్గం బనగానపల్లె ఎస్సైలు రామాంజనేయరెడ్డి, రామిరెడ్డి వందలాది మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. పలుకూరు పిహెస్సి వైద్యులు వైద్యసేవలు అందించారు.బనగానపల్లె ఆర్టీసీ డిపోవారు భక్తుల రాకపోకలకు అనుగుణంగా ప్రత్యేక బస్సులను నడిపారు. గ్రామ రైతు సంఘం సభ్యులు ఉత్సవాలకు వారివంతు సహకారం అందించారు. ఈ జ్యోతుల ఉత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిచ్చారు. కార్యనిర్వహణాధికారి రామానుజన్ ఆధ్వర్యంలో భక్తుల కోసం తాత్కాలిక వైద్య శిబిరం నిర్వహించారు.
అంగరంగ వైభవంగ పండువగా రథోత్సవం:
శ్రీచౌడేశ్వరీమాత తిరుణాలలో భాగంగా 5వ రోజైన ఆదివారం సాయంకాలం అమ్మవారి రథోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని రథంలో కొలువుదీర్చి భక్తులు భక్తిపారవశ్యంతో రథాన్ని ముందుకు లాగారు.

About Author