వైద్యసేవకు.. జీవితం అంకితం చేసిన జి. షిబారాణి…!
1 min readతుది శ్వాస వరకు.. వైద్యసేవలోనే …
ఫిబ్రవరి 10.. షిబారాణి జయంతి సందర్భంగా… ప్రత్యేక కథనం..
పల్లెవెలుగు వెబ్:
మానవ సేవే… మాధవ సేవ అని భావించిన ఆమె… తుది శ్వాస వరకు వైద్య సేవకే జీవితం అంకితం చేసింది. ఎందరో పేదలు, రోగులు, అనాథలకు, మరణశయ్యపై ఉన్న వారికి వైద్యసేవలు అందించి.. వారికి జీవితం ఇచ్చిన ఆమె… ఇప్పుడు మనముందు లేకపోవడం బాధాకరం. ఎన్నో అవార్డులు.. మరెన్నో ప్రశంసలు పొందిన ఆమె ఎందరికో స్ఫూర్తిదాయకం… ఆదర్శంగా నిలిచింది. లక్షల మంది ఆశీర్వాదం ఉన్నా.. కరోన మహమ్మారితో పోరాడి గెలవలేకపోయింది. పేదలకు వైద్యసేవలు అందిస్తూనే… తుది శ్వాస విడిచింది. ఆమె ఎవరో కాదు…. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్ విభాగంలో పని చేసే స్టాఫ్‌నర్స్ జి. షిభారాణి.
షిభారాణి అంటే.. రోగులకు ధైర్యం..:
ఉమ్మడి రాష్ట్రంతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చిన పేదలు, రోగులు కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుండెకు సంబంధించిన రోగులు ఆస్పత్రికి వస్తే… వారికి మనోధైర్యం కల్పిస్తూ… వైద్యసేవలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుండేది. అచంచలమైన నిబద్ధత..విశ్వాసం గల జి. షిబారాణి అంటే… తోటి నర్సులకు, పేదలకు కొండంత ధైర్యం.
21 ఏళ్ల సర్వీసు… సేవకే అంకితం..:
ప్రపంచం పట్ల ప్రేమ, సంరక్షణ మరియు కరుణకు చిహ్నంగా మారిన స్టాఫ్‌నర్స్ జి. షిబారాణి.. నోబెల్ శాంతి అవార్డు గ్రహిత మధర్ థెరిస్సాను ఆదర్శంగా తీసుకుని.. ఎంతో మంది పేదలకు, అనాథలకు దగ్గరుండి వైద్య సేవలు అందించారు. వృద్ధులు, నిరుపేదలు, రోగులు చావుకు దగ్గరున్న సమయంలో ఆమె ఆశాకిరణమైంది. ఆస్పత్రిలో చికిత్స పొంది.. కోలుకున్న వారు వైద్యులకంటే.. స్టాఫ్ నర్స్ జి. షిబారాణినే మెచ్చుకునే వారు. 21 ఏళ్లపాటు కార్డియాలజిస్ట్ విభాగంలోనే నర్స్‌గా సేవలు అందించిన ఏకైక సేవకురాలు జి. షిబారాణి… ఒకప్పుడు పేదల గుండె చప్పుడుగా ఉండేది.
అవార్డులు.. ప్రశంసలు..:
కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలోని కార్డియాలజి విభాగంలో రోగులకు విశేషమైన సేవలు అందించినందుకుగాను అప్పటి కలెక్టరు అజయ్‌జైన్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. పి. చంద్రశేఖర్ చేతుల మీదుగా అవార్డులు, ప్రశంసపత్రాలు అందుకుంది. ఆస్పత్రిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన రోగులు కొందరు మొక్కుతూ వెళ్లగా.. మరికొందరు షిబారాణిని ఆశీర్వదించి వెళ్లేవారు.
వైద్యులు మెచ్చిన.. స్టాఫ్‌నర్స్…:
ప్రతి రోజు వందల మంది పేదలు, రోగులు గుండెకు సంబంధించిన వైద్యచికిత్సలు కోసం వచ్చినా.. భయపడకుండా అందరి కంటే ముందుగా వచ్చి వైద్యసేవలు అందించే స్టాఫ్ నర్స్ షిబారాణిని వైద్యులు సైతం మెచ్చుకునేవారంటే అతిశయోక్తి కాదు. నిబద్ధత.. నిజాయితీ… పట్టుదల.. ధైర్యం… ముఖ్యంగా సేవ చేయాలన్న లక్ష్యమే… ఆమెకు అటు రోగుల్లోనూ.. ఇటు వైద్యులు, తోటి ఉద్యోగుల్లోనూ మంచి పేరు తెచ్చి పెట్టింది. ఓర్పు..సహనంతో రోగుల సమస్యను తెలుసుకుని.. అందుకు తగ్గట్టుగా చికిత్స చేసేవారు. డాక్టర్ వచ్చేంత వరకు ప్రాణం నిలబట్టే బాధ్యత ఆమె తీసుకునేది.
ఫిబ్రవరి 10న.. షిబారాణి జయంతి..:
ఎందరో జీవితాల్లో .. వైద్యసేవల ద్వారా వెలుగునిచ్చిన జి. షిబారాణి 2020, ఆగస్టు 28న మృతి చెందడం అత్యంత బాధాకరం. కర్నూలు వాసి అయిన షిబారాణి .. కులమత ప్రాంతమనే భేదం లేకుండా… వైద్యచికిత్సలు చేసింది. ఆమె భర్త ఏలియా కూడా సేవా దృక్పథంతో పేదలకు సేవ చేస్తున్నాడు. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో దాదాపు రూ. 3 లక్షలతో సుశ్రుత విగ్రహం ఏర్పాటు చేశారు. భార్య షిబారాణి ( ఫిబ్రవరి 10 జయంతి) జ్ఞాపకార్థం పేదలకు, రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేస్తున్నారు. అనాథలకు అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు.