జులై 10న షిర్డీ సాయిబాబామందిరం లో గురు పొర్ణమి వేడుకలు..
1 min read
విజయవాడ, న్యూస్ నేడు : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఉన్న ముత్యాలంపాడు షిరిడీ సాయిబాబా మందిరంలో జూలై 10న గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మందిరం గౌరవాధ్యక్షులు పూనూరు గౌతంరెడ్డి తెలిపారు. శనివారం ముత్యాలపాడు షిరిడి సాయిబాబా మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురుపౌర్ణమి రోజు తెల్లవారుజాము నుంచే విశేష పూజలు, అర్చనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాకడ హారతి, గణపతి పూజ, పంచామృతాలతో సహస్రకలశాభిషేకం చేయనున్నట్లు వెల్లడించారు. వందలాది మంది భక్తులు పాల్గొనే వీలుగా విష్ణు సహస్రనామ పారాయణం ఏర్పాటు చేశామని ఉదయం, సాయంత్రం బాబా వారికి, దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సుమారు 25 వేల మందికి అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. రాత్రి సాయి సేవకులతో కలిసి పల్లకీ ఉత్సవం నిర్వహించనున్నామని ప్రతి ఏడాది లానే ఈసారి కూడా గురువులను సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సాహిత్యవేత్త పిస్సార్ శర్మను గురువు హోదాలో సన్మానిస్తామని వెల్లడించారు. గురుపౌర్ణమి సందర్భంగా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు పాల్గొంటారని వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొని బాబా ఆశీస్సులు పొందాలని పూనూరు గౌతంరెడ్డి కోరారు ఈ కార్యక్రమంలోమందిర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.