చేనేత.. మెరవాలి..!
1 min read– జీవన ప్రమాణాలు మెరుగు పడాలి
– వైఎస్సార్ నేతన్న హస్తం కింద రూ.24వేలు
– మూడో విడత జిల్లాలో 3841 మందికి లబ్ధి
– ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరులో 4600 మంది చేనేతలకు పింఛన్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: చేనేత కుటుంబాల జీవన ప్రమాణాలు, స్థితిగతులను మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ నేతన్న హస్తం పథకాన్ని అమలు చేస్తోంది. మగ్గం ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి రూ.24వేలు ఆర్థిక సహాయం అందిస్తోంది. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరిట పథకాలను అమలు చేస్తోంది.
3841 మందికి నేతన్న హస్తం..4600 మందికి పింఛన్..
కర్నూలు జిల్లా చేనేత పరిశ్రమకు పెట్టింది పేరు అయిన ఎమ్మిగనూరు, కోడుమూరు, నందవరం, బనగానపల్లి, ఆదోని ప్రాంతాలలో అత్యధికంగా చేనేత కార్మికులు మగ్గాన్ని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారు. మొదటి ఏడాది కర్నూలు జిల్లాలోని 3,998 మంది నేతన్నలకు 9 కోట్ల 59 లక్షలు జమ చేశారు. రెండవ విడత కర్నూలు జిల్లాలోని 3,991 మంది నేతన్నలకు 9 కోట్ల 57 లక్షలు రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఇక మూడో విడత కూడా ఆగస్టు నెలలో కర్నూలు జిల్లాలోని నేతన్న నేస్తం 3841 మంది లబ్ధిదారుల ఖాతాలో 24 వేల రూపాయల చొప్పున జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. జిల్లాలోని 4,600 మంది చేనేత కార్మికులు పెన్షన్ పొందుతున్నారు.