వైభవం.. ‘శ్రీశ్రీశ్రీ గోడల వీర హనుమంత రాయుడి’ వార్షికోత్సవం..
1 min readస్వామి వారిని దర్శించుకున్న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
పల్లెవెలుగు, కర్నూలు: కోరిన కోర్కెలు తీరుస్తూ… భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న శ్రీశ్రీశ్రీ గోడల వీర హనుమంతు రాయుడు ఎంతో మహిమ గల దేవుడన్నారు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. శ్రీ కృష్ణ దేవరాయలు నిర్మించిన శ్రీశ్రీశ్రీ గోడల వీర హనుమంత రాయుడు దేవాలయం శిథిలావస్థకు చేరుకోగా… రెండేళ్ల క్రితం దామోదర్ ఆయిల్ మిల్ యజమాని మహేశ్వర రెడ్డి, ఆయన తనయుడు రాజేశ్వర రెడ్డి మరమ్మతులు చేయించి.. పున: నిర్మించారు. శ్రీశ్రీశ్రీ గోడల వీర హనుమంతు రాయుడు దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఆలయ పూజారి నరసింహయ్యతోపాటు చక్రవర్తుల జీవనాచార్యుల బృందం ఆధ్వర్యంలో ఆలయంలో విశేష పంచామృతాభిషేకం, నవగ్రహ మాతృక, ఆరాధన, విశేష రుద్ర యాగం, మహా పూర్ణాహుతి, విశేష హారతి తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయం వార్షికోత్సవం సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, బీజేపీ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి శబరి, బీజేపీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్ బి.వి. సుబ్బారెడ్డి స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు శ్రీ దామోదర్ ఆయిల్ మిల్లు యజమాని మహేశ్వర రెడ్డి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, బైరెడ్డి శబరి, బి.వి. సుబ్బారెడ్డికి శాలువా కప్పి మెమోంటో అందజేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కోటేశ్వరులు, ప్రభాకర్ రెడ్డి, రంగప్ప తదితరులు పాల్గొన్నారు.