ఆహ్లాదంగా అన్నపూర్ణమ్మ ఆవాసం 31 వ వార్షికోత్సవం
1 min read
పాల్గొన్న జిల్లా జడ్జ్ కబర్ది
ఆవాసానికి 10 ఎకరాలు దానం చేసిన భగవాన్ బాలసాయి బాబా సెంట్రల్ ట్రస్ట్
కర్నూలు, న్యూస్ నేడు: నిరుపేద విద్యార్థుల కోసం 30 సంవత్సరాలుగా కర్నూలు నగరంలో నిర్వహిస్తున్న అన్నపూర్ణమ్మ ఆవాసం వార్షికోత్సవం ఆదివారం సాయంకాలం ఆహ్లాదకరంగా సాగింది. సేవా భారతి ఆధ్వర్యంలో అన్నపూర్ణమ్మ ఆవాసం నిర్వహించబడుతోంది. స్థానిక వివేకానంద సంస్కృత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలోఅన్నపూర్ణమ్మ ఆవాసం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ పారిశ్రామికవేత్త శేరి బాల నాగరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాలను ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యకారిని సభ్యులు సుబ్బ లక్ష్మయ్య వివరించారు. కర్నూలు నగరంలో హెచ్ డి సి టి ఆవరణలోమెడికల్ క్లినిక్ నిర్వహిస్తున్నామని, అలాగే క్షయ నివారణ కోసం మొబైల్ మెడికల్ వ్యాన్ నిర్వహిస్తున్నామని, గోకవరంలో చెంచు విద్యార్థుల కోసం ఆవాసం నిర్వహిస్తున్నామని వివరించారు. కార్యక్రమానికి జిల్లా జడ్జి కబర్ది ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అన్నపూర్ణమ్మ ఆవాసంలో విద్యార్థులకు చదువు సంస్కారం ఒకేసారి అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో కేవలం చదువుకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన చెప్పారు. విద్యార్థులకు సంస్కారం కూడా అవసరమని ఆయన అన్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ క్షేత్ర సేవ ప్రముఖ్ ఎక్క చంద్రశేఖర్ మాట్లాడుతూ సేవాభారతి దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. నిరుపేద విద్యార్థుల కోసం 800 ఆవాసాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కర్నూలు లో శ్రీ భగవాన్ బాలసాయి బాబా సెంట్రల్ ట్రస్ట్ ఆవాసం కోసం 10ఎకరాల భూమిని దానం చేసిందని ఆయన ప్రకటించారు. అన్నపూర్ణమ్మ ఆవాసం అధ్యక్షులు బైరెడ్డి చిరంజీవి రెడ్డి, కార్యదర్శి బాలాజీ రావు తదితరులు పాల్గొన్నారు.
