నవరస నటసార్వభౌముడికి బర్త్‌డే శుభాకాంక్షలు..
1 min readసినిమా డెస్క్: తెలుగు సినిమా చరిత్రలో కైకాల సత్యనారాయణ అత్యున్నత స్థానం అధిరోహించారు. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌కి సమకాలీనులుగా ఎన్నో జానపద, పౌరణిక చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలో నటించి మెప్పించారు. నవరస నటసార్వ భౌముడు ఆయన బిరుదు. పార్లమెంట్ సభ్యుడుగా కూడా కైకాల కొంతకాలం కొనసాగారు. యముడి క్యారెక్టర్ అనగానే టక్కున గుర్తు వచ్చేది ఆయనే. నేటి తరంలో కూడా ఆయన ఎన్నో సాంఘిక చిత్రాల్లో నటించారు. రీసెంట్‌గా మహేష్ నటించిన మహర్షిలోనూ కైకాల నటించారు. మెగాస్టార్ చిరంజీవి పలు చిత్రాల్లో విలన్‌గా యాక్ట్ చేశారు. ఈ రోజు ఆయన 86వ పుట్టినరోజు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఆయన ఇంటికి మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో వెళ్లి కైకాల సత్యనారాయణ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ పుష్ప గుచ్ఛాన్ని అందించారు. కైకాలతో చాలా సేపు ముచ్చట్లాడారు. తమ కెరీర్ జర్నీలో ఎన్నో మెమరీస్ ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కైకాల ఇటీవల కేజీఎఫ్ చాప్టర్ 1 కి ఆయన సమర్పకులుగా కొనసాగిన సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మక హోంబలే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించగా కైకాల సత్యనారాయణ సమర్పకులుగా కొనసాగారు. తెలుగులోనూ కేజీఎఫ్ విజయం సాధించింది. త్వరలోనే సీక్వెల్ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.
– 1935 జులై 25న సత్యనారాయణ జన్మించారు. నటుడుగా షష్ఠిపూర్తి చేసుకున్నారు. 1959లో ‘సిపాయి కూతురు’ అనే చిత్రంలో మొదటిసారి నటించిన కైకాల ఇప్పటివరకూ 777 సినిమాల్లో నటించారు. అందులో 28 పౌరాణిక చిత్రాలు.. 51 జానపద చిత్రాలు.. 9 చారిత్రక చిత్రాలు.. ఉన్నాయి. 200 మంది దర్శకులతో పనిచేశారు. 223 సినిమాలు 100 రోజులు ఆడాయి. 59 సినిమాలు అర్ధశతదినోత్సవాలు జరుపుకున్నాయి. 10 సినిమాలు ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ ఆడినవి కూడా ఉన్నాయి. తమిళంలో రజినీకాంత్,- కమల్ హాసన్‌లతో కొన్ని చిత్రాలతో పాటుగా కన్నడ- హిందీ సినిమాల్లో కూడా కైకాల సత్యనారాయణ నటించారు. కైకాల సత్యనారాయణను ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం.. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డ్‌తో సత్కరించింది.